స్టార్ హీరోకి ఇంతకన్నా అవమానం ఏముంది

వందల కోట్ల వసూళ్లను మంచి నీళ్లు తాగినంత తేలిగ్గా వసూలు చేస్తాడని పేరున్న సల్మాన్ ఖాన్ కొత్త సినిమా కిసీకా భాయ్ కిసీకా జాన్ కు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాభవం ఎదురవుతోంది. మొదటి రోజు నెట్ కలెక్షన్లు కేవలం 15 కోట్లే రావడం ట్రేడ్ ని ఖంగారు పెడుతోంది. ఫస్ట్ డే ఎంత ముస్లింల ఉపవాసమని సరిపెట్టుకున్నా బయటికి వచ్చిన నెగటివ్ టాక్ దెబ్బకు వాళ్లంతా ఇప్పుడు థియేటర్లకు వస్తారన్న గ్యారెంటీ లేకుండా పోయింది. చాలా చోట్ల సింగల్ స్క్రీన్లు తప్ప మల్టీప్లెక్సుల బుకింగ్స్ మరీ అన్యాయంగా ఉన్నాయి. పట్టుమని పాతిక మంది లేని షోలు వేలల్లో పడ్డాయని టాక్

ఎప్పుడో 2011లో అంటే పన్నెండేళ్ల క్రితం ఇదే సల్మాన్ బాడీ గార్డ్ కి ఫస్ట్ డే 21 కోట్ల కలెక్షన్ వచ్చింది. అది కూడా తక్కువ టికెట్ రేట్లతో. ఆ ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యాయి. అయినా సరే దానికన్నా ఇంత వెనుకబడటం ఆశ్చర్యం కలిగించే విషయం. మరుసటి ఏడాది 2012లో ఏక్ ధా టైగర్ 33 కోట్లు, కిక్ 27 కోట్లు, సుల్తాన్ 36 కోట్లు తెచ్చి పెట్టాయి. అంతెందుకు ఘోరమైన డిజాస్టర్ గా చెప్పుకున్న రేస్ 3 కి వచ్చిన ఓపెనింగ్ అక్షరాలా 29 కోట్లు. భరత్ కి 42 కోట్లకు పైగా వచ్చాయి. కానీ కిసీకా భాయ్ కిసీకా జాన్ మాత్రం 16 కోట్లకే కిందామీదా పడటం ఊహించనిది

దీన్ని సల్మాన్ పాఠంగా తీసుకుంటాడో లేదో కానీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ట్రోలింగ్ మొదలుపెట్టారు. నెక్స్ట్ వచ్చే టైగర్ 3 లో షారుఖ్ ఖాన్ క్యామియో చేశాడు కాబట్టి ఆ ఫోటోని వాడుకుని మార్కెటింగ్ చేయాలి తప్పించి సల్లు భాయ్ కి ప్రత్యేకంగా ఓపెనింగ్స్ వచ్చే సీన్ ఉండదని ఎగతాళి చేస్తున్నారు. తెలుగు భాష తప్ప ఇంకో లాంగ్వేజ్ లో రిలీజ్ కాని సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష 12 కోట్లు రాబట్టడం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. అయినా హీరో దర్శకుడు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటే ఎంతటి దారుణమైన తిరస్కారం ఎదురవుతుందో చెప్పడానికి ఇదో గొప్ప ఉదాహరణ