ఒక హిట్టు వస్తే చాలు వెంటనే రెండు మూడు ఫ్లాపులు వరసగా పలకరించేలా సాగుతోంది రవితేజ కెరీర్. నటుడిగా ఇప్పుడు కొత్తగా ఋజువు చేసుకోవాల్సింది ఏమీ లేకపోయినా పదే పదే ఒకరకమైన కథలతో తన దగ్గరకు దర్శకులు వస్తున్న విషయాన్ని గుర్తించిన మాస్ మహారాజా ఇకపై రూటు మార్చాలని నిర్ణయిచుకున్నట్టు సమాచారం. అందులో భాగంగా వాల్తేరు వీరయ్య లాగా కథ బాగుంటే నిడివి ఎంత ఉంది ఇంకెవరెవరికి ప్రాధాన్యత ఇచ్చారు లాంటివి పట్టించుకోకుండా ఓకే చేస్తారట. టైగర్ నాగేశ్వరరావు అందులో భాగంగా ఎంచుకున్నదేనని ఇన్ సైడ్ టాక్.
ఇదిలా ఉండగా కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ ఇటీవలే రవితేజకు ఒక లైన్ చెప్పి మెప్పించారట. మధ్యవయసులో ఉండే ఒక కాలేజీ లెక్చరర్ పాత్రను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టు వినికిడి. ఇందులో స్టూడెంట్ గా మరో యూత్ హీరో అవసరం పడటంతో శర్వానంద్, నిఖిల్, సిద్దు జొన్నలగడ్డలలో ఒకరిని మెప్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. హీరోలు సంతకాలు చేస్తే తప్ప అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాదు.
చూస్తుంటే రవితేజ పూర్తిగా స్టైల్ మార్చేసి ప్రయోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడని అర్థమవుతోంది. రావణాసుర దారుణంగా డిజాస్టర్ అయినప్పటికీ సుధీర్ వర్మ చెప్పిన లైన్ నచ్చడం వల్లే స్వయంగా నిర్మాతగా మారి మరీ పది కోట్లకు పైగా నష్టాన్ని భరించాల్సి వచ్చింది. అయినా సరే ఇప్పటికిప్పుడు పంథాని మార్చుకోకుండా ఇకపై కూడా కొనసాగిస్తారట. మరోవైపు చిన్న సినిమాల ప్రొడక్షన్ ని మొదలుపెట్టిన రవితేజ ఇటీవలే చాంగురే బంగారురాజాని పూర్తి చేయించారు. తాను హీరోగా నటించకపోయినా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం లక్ష్యంగా ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారు