దెయ్యం సినిమాకు అర్ధరాత్రి ప్రీమియర్లు

ప్రపంచంలో ఇప్పటిదాకా లెక్కలేనన్ని హారర్ సినిమాలు వచ్చాయి కానీ వాటిలో ఈవిల్ డెడ్ ది ప్రత్యేక స్థానం. 1981లో దీని మొదటి భాగం వచ్చింది. చిమ్మ చీకటి ఉండే కారడివిలో ఒక పాడు బడిన ఇల్లు, అందులో సెల్లార్ లాంటి భూగర్భంలో పొంచి ఉండే దెయ్యాలు, పిక్నిక్ కోసం వెళ్లిన స్నేహితులు అక్కడ ఇరుక్కుపోయి వాళ్ళూ ఆత్మలుగా మారడం ఈ ఫార్ములా మొదలైంది దీంతోనే. ఒంటరిగా ఎవరూ లేకుండా భయపడకుండా థియేటర్లో ఈవిల్ డెడ్ చూస్తే నగదు బహుమతులు ఇచ్చేవాళ్ళు. కొందరు భయంతో షో చూస్తుండగానే గుండెపోటు వచ్చి చనిపోయిన దాఖలాలున్నాయి.

ఇదయ్యాక 1987లో ఈవిల్ డెడ్ 2, తిరిగి 1993లో ఆర్మీ అఫ్ డార్క్ నెస్ ఇలా మొత్తం మూడు భాగాలు వచ్చాయి. అన్నీ సూపర్ హిట్లే. హీరో సామ్ రైమి వీటి వల్లే స్టార్ అయ్యాడు. కట్ చేస్తే వీటిని స్ఫూర్తిగా తీసుకుని వరల్డ్ వైడ్ వేలల్లో హారర్ చిత్రాలు వచ్చాయి. 2013లో ఇంకో పార్ట్ వచ్చింది కానీ అది అంత గొప్పగా ఆడలేదు. తిరిగి పదేళ్ల తర్వాత ఈవిల్ డెడ్ రైజ్ పేరుతో రేపు కొత్త ఫ్రాంచైన్ ని రిలీజ్ చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే హైదరాబాద్ తో సహా ప్రధాన నగరాల్లో గురువారం అర్ధరాత్రి 12 తర్వాత స్పెషల్ ప్రీమియర్లు వేస్తుండగా అన్ని గంటల్లోనే హౌస్ ఫుల్ అవుతున్నాయి.

దీన్ని బట్టే ఈవిల్ డెడ్ కున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కొత్త తరం కూడా దీన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. ఓవర్ సీస్ రిపోర్ట్స్ చాలా పాజిటివ్ గా ఉండగా ట్రైలర్ చూస్తేనే ఓ రేంజ్ లో ఒళ్ళంతా చమటతో తడిసిపోయేలా ఉంది. విచిత్రంగా సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ కన్నా ఈ భూతాల మూవీకే మల్టీ ప్లెక్స్ బుకింగ్స్ బాగుండటం షాక్ కలిగించే అంశం. జులాయిలో అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఎంఎస్ నారాయణ ఓ మాట అంటారు. ఎంత భయపడినా సరే హారర్ సినిమాలు చూడకుండా ఉండలేకపోవడం ఒక వ్యసనం. అందుకేనేమో ఈవిల్ డెడ్ మీద ఇంత హైప్ ఉంది.