ప్రశంసలు టన్నుల్లో వసూళ్లు లక్షల్లో

సినిమా అందరూ బాగుందని మెచ్చుకున్నారు. రివ్యూలు పాజిటివ్ గా వచ్చాయి. పబ్లిక్ టాక్ ఒక డిఫరెంట్ మూవీ చూశామని చెప్పాయి. కట్ చేస్తే మొదటి రోజు కోటి ఇరవై లక్షల దాకా వసూలు చేసి డీసెంట్ అనిపించుకుంది. కానీ ఇదంతా విడుదల పార్ట్ 1కు సానుకూలంగా మారలేకపోయింది. టిపికల్ మూవీస్ తో అణుగారిన వర్గాలకు ప్రతినిధిగా ఎన్నో గొప్ప చిత్రాలు అందించిన దర్శకుడు వెట్రిమారన్ నుంచి వచ్చిన మరో క్లాసిక్ ఇది. విమర్శలు ఎంత మెచ్చుకున్నా సాధారణ ప్రేక్షకులను ఎక్కువ సంఖ్యలో థియేటర్ల దాకా రప్పించలేకపోతోంది. నగరాల్లోనే బాగా నెమ్మదించేసింది.

గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అరవింద్ పంపిణి చేసినప్పటికీ దీన్ని మరింత బలంగా పబ్లిక్ లోకి తీసుకెళ్లేలా ప్రమోషన్లు చేయకపోవడంతో రీచ్ లిమిటెడ్ గా మారింది. పోటీలో శాకుంతలం, రుద్రుడు రెండూ డిజాస్టర్ అయినప్పటికీ విడుదల పార్ట్ 1 ఆ అవకాశం వాడుకోలేదు. 80 దశకం నాటి పోలీస్ నక్సలైట్ యుద్ధాన్ని చూసేందుకు తెలుగు ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. వెట్రిమారన్ ఎంత రియలిస్టిక్ గా చూపించినా హింస మోతాదుతో పాటు ప్రాంతీయత సమస్య రావడం వల్ల ఫ్యామిలీ జనాలు దూరంగా ఉండిపోయారు.

స్వంతగా రిలీజ్ చేయడం వల్ల విడుదల పార్ట్ `1 కలెక్షన్ల లెక్కలకు సంబంధించిన వివరాలు బయటికి రావడం లేదు. పార్ట్ 2 బిజినెస్ కి ఇది చాలా కీలకం కానుంది. విజయ్ సేతుపతి పాత్ర రెండో భాగంలోనే ఎక్కువ హైలైట్ కాబోతోంది కాబట్టి అది రిలీజయ్యే టైంకి ఈ అంశాన్నే ఎక్కువ మార్కెటింగ్ చేసుకోవాలి. ఇంకా విడుదల తేదీ ఖరారు చేయలేదు కానీ ఈసారి తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి ప్లాన్ చేసినట్టు తెలిసింది. థియేటర్ల సంగతి ఎలా ఉన్నా షాకింగ్ కంటెంట్ ఉన్న విడుదల పార్ట్ 1కి ఓటిటిలో వచ్చాక మాత్రం ఓ రేంజ్ రెస్పాన్స్ రావడం ఖాయం.