ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుల హవా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ఏడాది చివర్లో సూర్యకుమార్ ప్రతాప్ 18 పేజెస్‌తో హిట్టు కొడితే.. ఈ ఏడాది దసరా మూవీతో టాలీవుడ్లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. వీళ్లిద్దరూ సుక్కు శిష్యులే. ఇక వచ్చే శుక్రవారం విడుదల కానున్న విరూపాక్ష సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్న కార్తీక్ దండు సైతం సుక్కు మాజీ అసిస్టెంటే.
అతడి కథకు సుకుమారే స్వయంగా స్క్రీన్ ప్లే కూడా సమకూర్చాడు ఈ సినిమాకు సంబంధించి తాజా ప్రమోషనల్ ఈవెంట్లో సుకుమార్.. తన శిష్యుడి గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. అతను చావు దగ్గరికి వెళ్లి వెనక్కి వచ్చినట్లు తెలిపాడు. కార్తీక్ తనను తొలిసారి కలిసే సమయానికి తన జీవితం చాలా చిన్నదని ఆయన వ్యాఖ్యానించాడు. అప్పటికి ఐదారేళ్లకు మించి అతను బతికే ఛాన్స్ లేదని వైద్యులు చెప్పారన్నాడు. కార్తీక్‌కు ఒక ఆరోగ్య సమస్య ఉండేదని.. దాని వల్ల అతడి ప్లేట్‌లెట్స్ పడిపోయేవని.. అలాంటి స్థితి నుంచి అతను పోరాడి విరూపాక్ష లాంటి సినిమాను డైరెక్ట్ చేయడం చిన్న విషయం కాదని సుకుమార్ చెప్పాడు.
తనకు తీవ్ర అనారోగ్య సమస్య ఉన్నప్పటికీ తను చనిపోయేలోపు ఒక సినిమా డైరెక్ట్ చేసి వెళ్లిపోవాలని అతను అనుకున్నాడని.. ఐతే ఇందుకోసం చేసిన పోరాటంలో, తన తల్లి ప్రార్థనల వల్ల అదృష్టం కొద్దీ ఆ అనారోగ్య సమస్యను కార్తీక్ అధిగమించాడని సుకుమార్ తెలిపాడు. విరూపాక్ష సినిమాను అతను చాలా బాగా తీశాడని.. కథ చెప్పడం బాగా వచ్చిన వాడు దర్శకత్వం కూడా బాగా చేస్తాడని.. కార్తీక్‌కు ఆ నైపుణ్యం ఉందని ఆయన అన్నాడు. తాను ఈ సినిమాకు చేసింది పెద్దగా ఏమీ లేదని.. కార్తీక్‌ను పుష్ చేయడం మాత్రమే చేశానని సుకుమార్ వ్యాఖ్యానించాడు.