టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడైన సురేందర్ రెడ్డి చివరగా సైరా నరసింహారెడ్డి లాంటి భారీ చిత్రం తీశాడు. ఆ సినిమాలో ఉన్నంతలో బాగానే ఆడినా.. బడ్జెట్ మరీ ఎక్కువ పెట్టేయడం వల్ల కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. దర్శకుడిగా సురేందర్ అయితే తన వరక మంచి పనితనమే చూపించాడు. అయినా అతడి కెరీర్లో చాలా గ్యాప్ వచ్చేసింది.
అతను కోరుకున్న స్థాయి పెద్ద సినిమా చేయలేకపోయాడు తర్వాత. చివరికి అఖిల్‌తో ఏజెంట్ సినిమాను మొదలుపెట్టాడు. కానీ ఈ సినిమా కూడా రకరకాల కారణల వల్ల ఆలస్యం అయింది. గత ఏడాది మధ్యలోనే రిలీజ్ కావాల్సిన చిత్రం.. చివరికి ఈ నెల 28కు రిలీజ్ డేట్ పిక్స్ చేసుకుంది. ఆ డేట్ అందుకోవడానికి కూడా టీం చాలా కష్టపడాల్సి వస్తోంది. మరి ఈ సినిమా ఇంత ఆలస్యం కావడానికి కారణమేంటని ఏజెంట్ ప్రెస్ మీట్లో విలేకరులు అడిగితే సమాధానం చెప్పాడు సురేందర్.
ఏజెంట్ సినిమాకు వర్కింగ్ డేస్ 100 రోజులు మాత్రమే అని సురేందర్ వెల్లడించాడు. కరోనా వల్ల దాదాపు ఏడాది పాటు చిత్రీకరణ జరపలేకపోయామన్నాడు. ఇక తానేమో ఆరు నెలల పాటు ఆసుపత్రిలో ఉండటం వల్ల కూడా సినిమా ఆలస్యం అయిందని సురేందర్ తెలిపాడు. ఐతే ఆరు నెలలు ఆసుపత్రిలో ఉన్నాడంటే సురేందర్‌కు ఏమైందా అన్న చర్చ మొదలైంది.
అతను కరోనా సోకి ఇబ్బంది పడ్డాడా.. అలా అయినా అంత కాలం ఆసుపత్రిలో ఉండటం ఏంటి.. ఇంకేదైనా పెద్ద ఆరోగ్య సమస్య తలెత్తిందా అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ఇక ఏజెంట్ సినిమా గురించి మాట్లాడుతూ.. అఖిల్ లేకుండా ఈ సినిమా లేదని.. అతను పెర్ఫామెన్స్ అదరగొట్టేశాడని సురేందర్ తెలిపాడు.
మమ్ముట్టి పాత్ర కూడా చాలా కీలకం అని.. ఆయన సినిమా కోసం ఎంతో సహకరించాడని సురేందర్ తెలిపాడు. తాను అభిమానుల గురించి ఆలోచించి సినిమా తీయనని.. ఏజెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందని అతను ధీమా వ్యక్తం చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates