స‌మంత సినిమా అంత పెట్టి చూస్తారా?

స‌మంత త‌న కెరీర్లో అతి పెద్ద బాక్సాఫీస్ ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇండియాలో అతి పెద్ద బ‌డ్జెట్లో తెర‌కెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీ శాకుంత‌లంలో ఆమె లీడ్ రోల్ చేసిన సంగ‌తి తెలిసిందే. సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత ఈ శుక్ర‌వార‌మే శాకుంత‌లం థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. స‌మంత‌ను న‌మ్మి గుణ‌శేఖ‌ర్, దిల్ రాజు క‌లిసి భారీ బ‌డ్జెట్టే పెట్టారీ సినిమా మీద‌. రాజీ లేకుండా సినిమాను నిర్మించారిని ప్రోమోలు చూస్తే అర్థం అవుతోంది.

కానీ స్టార్ హీరోలు లేకుండా ఇలాంటి సినిమాల‌కు హైప్ తీసుకురావ‌డం క‌ష్టం కాదు. అదే ఈ సినిమాకు కొంచెం మైన‌స్ అయింది. విడుద‌ల ముంగిట ఆశించిన స్థాయిలో బ‌జ్ లేదు శాకుంత‌లంకి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా డ‌ల్లుగా న‌డుస్తున్నాయి. సినిమాకు పెట్టిన బ‌డ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని టికెట్ల ధ‌ర‌లు ఎక్కువ పెట్ట‌డం కూడా మైన‌స్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది.

శాకుంత‌లం త్రీడీ వెర్ష‌న్‌ను హైద‌రాబాద్‌లోని మ‌ల్టీప్లెక్సుల్లో చూడాలంటే 325 రూపాయ‌లు పెట్టాలి. ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటే ఇంట‌ర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు అద‌నం. కొన్ని ప్రీమియం మ‌ల్టీప్లెక్సుల్లో రేటు 400కు ద‌గ్గ‌రగా ఉంది. సింగిల్ స్క్రీన్ల‌లో రేటు 195గా పెట్టారు. రెనొవేట్ కాని సింగిల్ స్క్రీన్ల‌లో మాత్ర‌మే 150 రేటుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా దీనికి ద‌గ్గ‌ర‌గానే ఉన్నాయి రేట్లు. త్రీడీ వెర్ష‌న్ కాబ‌ట్టి రేట్లు ఎక్కువ ఉన్నాయ‌న్న‌ది స్ప‌ష్టం. కానీ మ‌ల్టీప్లెక్సుల్లో నార్మ‌ల్ వెర్ష‌న్ కూడా రూ.295 అంటే జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డం క‌ష్ట‌మే.

సినిమాకు అనుకున్న స్థాయిలో హైప్ లేని నేప‌థ్యంలో అధిక‌ టికెట్ల ధ‌ర‌లు చేటు చేసే ప్ర‌మాదం ఉంది. ఎంత పీరియ‌డ్ ఫిలిం అయినా లేడీ ఓరియెంటెడ్ కావ‌డం మైన‌స్సే. కాబ‌ట్టి టికెట్ల ధ‌ర‌లు కొంచెం తగ్గించే ప్ర‌య‌త్నం చేయాల్సింది.