అతి తక్కువ బడ్జెట్ లో రూపొంది కేవలం క్యారెక్టర్ ఆరిస్టులతోనే యాభై కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మలయాళం బ్లాక్ బస్టర్ రోమాంచమ్ ఇటీవలే డిస్నీ హాట్ స్టార్ లో తెలుగు ఆడియోతో పాటుగా వచ్చేసింది. ఇంత సంచలన విజయం సాధించినా తెలుగు రీమేక్ హక్కులకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా మ్యాటర్ తెలిశాక ఎందుకో అర్థమవుతుంది. ఇది సింపుల్ కథ. 1997 ప్రాంతంలో జరుగుతుంది. ఏడుగురు బ్రహ్మచారులు బెంగళూరు నగర శివార్లలో ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఉంటారు. ఒకడికి ఉద్యోగం మరొకడికి వ్యాపారం తప్ప మిగిలినవాళ్లంతా బేవార్సే. ఇంటర్వ్యూలకు వెళ్లి రావడం ఫెయలవ్వడం ఇదో నిత్యకృత్యంగా మారుతుంది.
జీవన్(సౌబిన్ షాహిర్) ఒకసారి స్నేహితుడి దగ్గర ఆత్మలను పిలిచే ఓజో బోర్డు గేమ్ చూసి అలాంటిదే ఫ్రెండ్స్ ని కూర్చోబెట్టి రూమ్ లోనూ ప్రయత్నిస్తాడు. మొదట సరదాగా తీసుకున్నా తర్వాత నిజంగానే అనామిక అనే ఆత్మ ప్రవేశించి వీళ్ళు అడిగే ప్రశ్నలకు క్యారం బోర్డు మీద టీ గ్లాసుని కదిలిస్తూ సమాధానం చెబుతుంటుంది. ఇది అందరికి తెలిసిపోయి వీళ్ళ రూమ్ కి క్యూ కడతారు. అక్కడి నుంచి కొన్ని అనూహ్య సంఘటనలు జరిగి జీవన్ ఆసుపత్రిలో చేరేదాకా వెళ్తుంది. దెయ్యం ఎవరికీ కనిపించదు కానీ ఒక్క జీవన్ మాత్రం తన పసుపుపచ్చ బ్యాగులో దూరడం చూస్తాడు.
తీరా చూస్తే ఆ లగేజీ తిరిగి ఇతనుండే హాస్పిటల్ కే వస్తుంది. ఇక్కడ చెప్పని స్టోరీ చాలా ఉంది. దాదాపు సినిమా మొత్తం మూడు రూములున్న ఒకే ఇంట్లో జరుగుతుంది. అవుట్ డోర్ లొకేషన్లు రెండు మూడు కనిపిస్తాయి అంతే. ఖర్చు మొత్తం లెక్కేసినా కోటి కూడా దాటి ఉండదు. సింపుల్ కామెడీ, భయపెట్టే ఉద్దేశం పెట్టుకోకుండా హారర్ ని స్మూత్ గా డీల్ చేసిన విధానం ఆకట్టుకుంటాయి. అయితే డ్రామాని ఎక్కువగా ఇష్టపడే మన ఆడియన్స్ కి ఈ రోమాంచమ్ అంతగా ఎక్కకపోవచ్చు. కాకపోతే టైంపాస్ కి లోటు ఉండదు. ఇలా కూడా సినిమా తీసి హిట్టు కొట్టొచ్చా అనే దానికి ఇదే మంచి ఉదాహరణ.