రవిబాబును నమ్ముకున్న రామోజీ

తెలుగు మీడియా రంగంలో రామోజీ గ్రూప్ ఆధిపత్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాలకు పైగా ‘ఈనాడు’ తెలుగులో నంబర్ వన్ పత్రికగా కొనసాగుతోంది. 90వ దశకంలో ఈటీవీ కూడా తిరుగులేని స్థాయిలో ఉంది. కానీ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో విపరీతంగా పోటీ పెరిగిపోయి ఈటీవీ వెనుకబడిపోయింది. ఇప్పటికీ సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న ఈటీవీ తనకంటూ ఒక వర్గం ప్రేక్షకులను నిలబెట్టుకుంటూ సాగుతోంది. కానీ టీఆర్పీ రేసులో మాత్రం ‘ఈటీవీ’ బాగా వెనుకబడిపోతోంది. ఇలాంటి టైంలో ఈటీవీ విన్ పేరుతో ఓటీటీ యాప్ తీసుకొచ్చింది రామోజీ గ్రూప్.

ఐతే ఇప్పుడున్న పోటీలో ఆ పేరుతో యాప్ ఉన్నట్లు కూడా చాలామందికి తెలియదు. అందులో రామోజీ నిర్మాణంలో తెరకెక్కిన ఎన్నో క్లాసిక్స్ అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు ఈటీవీ సీరియళ్లు, రియాలిటీ షోలు కూడా పెట్టారు. కానీ దాని సబ్‌స్క్రైబర్లు చాలా తక్కువ.

ఓటీటీ అంటే భారీ పెట్టుబడులు పెట్టాలి. కొత్త కొత్త సినిమాలు కొని అందించాలి. అలాగే సొంతంగా ఒరిజినల్స్ ప్రొడ్యూస్ చేసి ఎప్పటికప్పుడు అందిస్తుండాలి. అప్పుడే సబ్‌స్క్రైబర్లు పెరుగుతారు. కానీ ట్రెండుకు తగ్గట్లుగా ఈటీవీ విన్ టీం ఏమీ చేయలేకపోతోంది. ఐతే ఇన్నాళ్లూ తమ వద్ద ఉన్న కంటెంట్‌ను ఉచితంగా కంటెంట్ అందిస్తూ వచ్చిన రామోజీ.. ఇప్పుడు దాన్ని కమర్షియలైజ్ చేయాలనుకుంటున్నారు. ఏడాదికి రూ.365‌తో సబ్‌స్క్రిప్షన్ పెడుతున్నారు. సబ్‌స్క్రిప్షన్ పెడితే కంటెంట్ పెంచక తప్పదు. ఇందుకోసం ముందుగా రామోజీ.. దర్శకుడు రవిబాబును నమ్ముకున్నారు.

ఒకప్పుడు రామోజీ నిర్మాణంలో నచ్చావులే, నిన్నిలా సినిమాలు తీశాడు రవిబాబు. అందులో తొలి చిత్రం సూపర్ హిట్ అయితే.. రెండోది పోయింది. ఈ మధ్య దర్శకుడిగా రవిబాబు అస్సలు ఫాంలో లేడు. చివరగా అతను తీసిన ‘క్రష్’ చడీచప్పుడు లేకుండా ఒక ఓటీటీలో రిలీజైంది. మినిమం రెస్పాన్స్ లేదు. ఇలాంటి దర్శకుడు ఈటీవీ విన్ కోసం ‘అసలు’ అనే సినిమా తీస్తున్నాడు. ఈ ఓటీటీలో సబ్‌స్క్రిప్షన్ మొదలయ్యాక వస్తున్న తొలి ఒరిజినల్ మూవీ ఇది. రవిబాబుతో ‘అవును’ లాంటి సూపర్ హిట్ చేసిన పూర్ణ ఇందులో లీడ్ చేసింది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఈ నెల 13న ఈటీవీ విన్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ‘ఈటీవీ విన్’ పట్ల జనాలకు ఏమాత్రం క్రేజ్ పెంచుతుందో.. ఎన్ని సబ్‌స్క్రిప్షన్లు తీసుకొస్తుందో చూడాలి.