ఇంకో లక్కీఛాన్స్ కొట్టేసిన దసరా

మొన్న మార్చి 30న విడుదలైన దసరా నాని కోరుకున్నట్టే బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. హిందీ తదితర భాషల్లో ఆడియన్స్ ఈ సినిమాని సరిగా రిసీవ్ చేసుకోకపోయినా ఏపీ తెలంగాణతో పాటు ఓవర్సీస్ లో వచ్చిన స్పందన పట్ల నిర్మాత డిస్ట్రిబ్యూటర్లు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే రెండో వారంలో ప్రవేశించినప్పటి నుంచి దసరా కొంత నెమ్మదించింది. ముఖ్యంగా వీక్ డేస్ లో డ్రాప్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. దానికి తోడు శుక్రవారం కొత్త రిలీజులు ఎలా ఉంటాయోనన్న టెన్షన్ కొంత మేర వెంటాడింది. ఫైనల్ గా హమ్మయ్య అనేసుకోవచ్చు.

ఎందుకంటే రావణాసుర, మీటర్ రెండింటి టాక్ సోసోగానే వచ్చింది. మొదటిది రవితేజ నెగటివ్ యాక్షన్ కోసమైనా చూడొచ్చని అభిమానులు రికమండ్ చేస్తుండగా కిరణ్ అబ్బవరం మూవీ మాత్రం వీలైనంత త్వరగా సెలవు తీసుకునేలా కనిపిస్తోంది. ఓపెనింగ్స్ మరీ దారుణంగా రాగా రిపోర్ట్స్ సైతం అంతంతమాత్రంగా ఉండటంతో పికప్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో దసరాకు మళ్ళీ ఛాన్స్ దొరికేసింది. మాస్ ఆడియన్స్ కి ఇదొక్కటే ఆప్షన్ గా నిలవడంతో నిన్న మధ్యాన్నం నుంచే షోల ఆక్యుపెన్సీలో పెరుగుదల కనిపిస్తోంది. శని ఆదివారాలు మెయిన్ సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ ఖాయమే.

ఇప్పటిదాకా వంద కోట్ల గ్రాస్ దాటేసిన దసరాకు ఇంకో వారం టైం దొరకనుంది. ఈ ఫ్రైడే శాకుంతలం, రుద్రుడు తప్ప ఇంకే రిలీజులు లేవు. సమంతా మూవీ ఫాంటసీ కాబట్టి దాని టార్గెట్ ప్రేక్షకులు వేరు. పైగా మరీ అంత భీభత్సమైన హైప్ ఏమీ లేదు. ఇక రుద్రుడు రొట్ట రొటీన్ తంతులాగే కనిపిస్తున్నా లారెన్స్ ఇలాంటి వాటితో జనాన్ని లాగడంలో నేర్పరి కాబట్టి ఈసారి అలాంటి మేజిక్ ఏదైనా చేస్తాడేమో చూడాలి. మొత్తానికి దసరాకు ఫేస్ టు ఫేస్ పోటీ ఇచ్చేది దగ్గరలో అయితే లేదు. అందుకే ఎక్స్ ట్రా థియేటర్ల అగ్రిమెంట్లు మరికొంత కాలం పొడిగించబడ్డాయని ట్రేడ్ టాక్.