గంగమ్మ గెటప్ వెనుక అసలు కథ

ఈ రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిన్న సాయంత్రం విడుదల చేసిన పుష్ప 2 ది రూల్ టీజర్ కన్నా పోస్టర్ ఎక్కువ వైరల్ అయ్యింది. షాకిచ్చే రీతిలో బన్నీ ఆడవేషధారణలో కనిపించి దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ కు హాట్ టాపిక్ గా మారాడు. ఇది ఎవరూ ఊహించని ట్విస్టు. సుకుమార్ పార్ట్ టూని ఎంత పకడ్బందీగా తీస్తున్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పుష్ప డాన్ గా మారాక జరిగే పరిణామాలు ఈ సీక్వెల్ లో ఉండబోతున్నాయి. ముఖ్యంగా తిరుపతి జైలు నుంచి తప్పించుకున్నాక ఎలాంటి అరాచకాలు జరిగాయన్నది అసలు హైలైట్ గా నిలవబోతోంది.

అసలీ గెటప్ వెనుక పెద్ద కథే. అదేంటో సింపుల్ గా చూద్దాం. వందల సంవత్సరాల క్రితం తిరుపతితో పాటు చుట్టుపక్కల పల్లెటూళ్లను పాలెగోండులు పరిపాలించేవాళ్ళు. వాళ్ళకు ఆడపిల్లను వేధించడం, శీలాలు దోచుకోవడం నిత్యకృత్యం. ఈ దుర్మార్గుల బారిన కాపాడేందుకు గ్రామ దేవత గంగమ్మ తల్లి అక్కడ పుడుతుంది. పెద్దయ్యాక పాలెగొండులు ఆమె మీద కన్నేస్తారు. రాక్షస సంహారం మొదలుపెట్టే సమయంలో అడవిలోకి పారిపోతారు. వాళ్ళను బయటికి రప్పించడం కోసం మగాళ్లు విచిత్ర వేషధారణతో ఏడు రోజుల జాతర చేస్తారు. తర్వాత రౌడీ గుంపు బయటికి వచ్చాక గంగమ్మ ఉగ్రరూపంతో దుష్టశిక్షణ చేస్తుంది.

అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఈ ఘటన జరిగాకే అక్కడ అత్యాచారాలు ఆగిపోయి అమ్మాయిలకు రక్షణ దక్కిందని స్థల పురాణాలు చెబుతాయి. దర్శకుడు సుకుమార్ ఇదంతా స్ఫూర్తిగా తీసుకుని క్లైమాక్స్ కు ముందు వచ్చే ఎపిసోడ్ లో ఈ గెటప్ ని డిజైన్ చేయించారట. ఫస్ట్ పార్ట్ లో శ్రీవల్లి మీద కన్నేసిన జాల్ రెడ్డి ని అంతమొదించేందుకు వేసిన స్కెచ్ లోనే ఇది ఉండొచ్చని కూడా వినిపిస్తోంది. మొత్తానికి అభిమానులకు భారీ గూస్ బంప్స్ ఇచ్చేందుకు పుష్ప 2 టీమ్ పెద్ద ప్లాన్స్ లోనే ఉంది. వేసవిలో విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.