ఒక్క రూపాయికి మల్టీప్లెక్స్ అనుభూతి

అదేంటి ఒక్క రూపాయికి చాక్లెట్ రావడమే కష్టమనుకుంటే థియేటర్ కంటెంట్ ఏంటనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. పెద్దగా ఆడియన్స్ రాని డ్రై సీజన్ లో మల్టీప్లెక్సులకు రెవిన్యూ రావడం పెద్ద సవాల్ గా మారిపోయింది. అప్పుడప్పుడు టికెట్ ధరలు 110 రూపాయలు పెట్టినా, వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇచ్చినా సరిపోవడం లేదు. అందుకే ఆదాయ మార్గాలను పెంచుకునే క్రమంలో కార్పొరేట్ సంస్థలు ఎంబిఏలో చదివే మార్కెటింగ్ ఎత్తుగడలను ఎంచుకుంటున్నాయి. సుప్రసిద్ధ పివిఆర్ చైన్ ఇప్పుడదే దారిపట్టి కొత్త ట్రెండ్ ని పరిచయం చేయాలని చూస్తోంది.

ఇదేంటంటే కేవలం ఒక్క రూపాయి చెల్లించి పివిఆర్ స్క్రీన్ లో 30 నిమిషాల పాటు బాలీవుడ్ హాలీవుడ్ తో పాటు ప్రాంతీయ భాషలకు సంబంధించిన సరికొత్త ట్రైలర్లు వెండితెర మీద చూసి ఎంజాయ్ చేయొచ్చు. పూర్తి ఏసీ గాలిని ఎంజాయ్ చేయడంతో పాటు తోచినవి కొనుక్కుని తినొచ్చు. అయితే ఫ్రీగా యూట్యూబ్ లో దొరికే వాటిని ఇలా స్క్రీన్ మీద అదే పనిగా చూసేందుకు ఎవరొస్తారనే సందేహం కలగొచ్చు. కానీ ఇక్కడో స్ట్రాటజీ ఉంది. అదే పనిగా ఎవరు రారు నిజమే. అయితే షాపింగ్ కోసం వచ్చి కాసేపు బ్రేక్ కావాలని చూస్తున్న వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది.

దీంతో తమ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉందో కొత్త ఆడియన్స్ కి కేవలం ఒక్క రూపాయికే చూపించినట్టు అవుతుంది. కోట్లు పెట్టి టీవీలో పేపర్లలో యాడ్స్ ఇవ్వడం కన్నా కరెంట్ ఖర్చుని భరించి ఇలా ట్రైలర్లు వేయడం వల్ల వచ్చే నష్టం తక్కువ కదా. పైగా ఇలా వేస్తున్నందుకు సదరు నిర్మాతల దగ్గర నుంచి ఎలాగూ డబ్బులు ఛార్జ్ చేస్తారు. ప్రస్తుతానికి ఈ స్క్రీనింగ్స్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో అమలవుతోంది. త్వరలో హైదరాబాద్ కు రానుంది. ఎప్పుడో జెమిని ఛానల్ లో బయోస్కోప్ పేరుతో వచ్చే ట్రైలర్లని జనం కళ్లప్పగించి చూసేవాళ్ళు. ఇప్పుడదే మల్టీప్లెక్సులో చూసుకోవచ్చు.