మాస్ రాజా రవితేజ సినిమాలంటే ఫ్యామిలీ మొత్తం చూసేలా ఉంటాయి. యాక్షన్ డోస్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ.. ఏ వర్గం ప్రేక్షకులైనా చూసేలాగే ఆయన సినిమాలు తెరకెక్కుతుంటాయి. అలాంటి హీరో సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాస్ రాజా కొత్త చిత్రం ‘రావణాసుర’కు ఇటీవలే సెన్సార్ పూర్తి కాగా.. దానికి ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
‘రావణాసుర’ ట్రైలర్ చూస్తే హింస మోతాదు కొంచెం ఎక్కువ ఉన్నట్లే కనిపించింది. అంతమాత్రాన ‘ఎ‘ ఇవ్వడం ఏంటి అన్న సందేహాలు కలిగాయి. మాస్ రాజా సినిమా అంటే పిల్లలు బాగానే థియేటర్లకు వస్తారు. మరి వాళ్లు చూడకూడని సినిమా చేశాడా రవితేజ అన్న చర్చ నడుస్తోంది. ఐతే ‘రావణాసుర’కు ‘ఎ’ ఇవ్వడానికి దాని టీం పట్టుదలే కారణం అని సమాచారం.
ఓ బెంగాలీ సినిమా ఆధారంగా తెరకెక్కిన ‘రావణాసుర’ను.. దర్శకుడు సుధీర్ వర్మ తన అభిమాన హాలీవుడ్ డైరెక్టర్ క్వింటన్ టొరంటినో సినిమాల తరహాలో తీశాడట. టొరంటినో సినిమాల్లో వయొలెన్స్ మోతాదు కొంచెం ఎక్కువే ఉంటుంది. అలాగే బూతులు వెల్లువలా వచ్చి పడుతుంటాయి. సన్నివేశాలు చాలా ‘రా’గా కూడా ఉంటాయి. ‘రావణాసుర’ కథను ఈ స్టయిల్లో చెబితే దానికి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో హింస, బూతుల మోతాదు కొంచెం ఎక్కువగానే ఉండేలా చూసుకున్నాడట సుధీర్ వర్మ. సినిమా సెన్సార్‌కు వెళ్లినపుడు బోర్డు వాళ్లు చాలా కట్స్ చెప్పారట. ఆ కట్స్ అన్నింటికీ ఓకే చెబితే సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడానికి రెడీ అయ్యారట.
ఐతే వాళ్లు చెప్పిన కట్స్ అన్నిటికీ ఓకే చెబితే సినిమా ఎసెన్సే దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో ‘ఎ’ ఇచ్చినా పర్వాలేదు కట్స్‌కు మాత్రం నో అన్నారట. అలా ఈ సినిమాకు ‘ఎ’ వచ్చినట్లు సమాచారం. ఐతే పోస్టర్ మీద ‘ఎ’ ఉందంటే ఫ్యామిలీస్, పిల్లలు సినిమా చూడ్డం కష్టమే. సింగిల్ స్క్రీన్లలో ఏమో కానీ.. మల్టీప్లెక్సుల్లో అసలు పిల్లల్ని లోనికే అనుమతించరు.