లక్ష్యానికి సమీపంలో దసరాకు అసలు పరీక్ష

అనూహ్య రీతిలో సంచలన విజయం సాధించిన దసరా మొదటి వీకెండ్ ని అద్భుతంగా ముగించింది. కేవలం నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వెళ్ళిపోయి ఔరా అనిపించింది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 47 కోట్ల షేర్ సాధించిన న్యాచురల్ స్టార్ సినిమా గ్రాస్ రూపంలో 84 కోట్ల దాకా రాబట్టింది. ఇవాళ సోమవారం నుంచి అసలు పరీక్ష మొదలుకానుంది. మాములుగా బ్లాక్ బస్టర్స్ కి మండేనాడు మరీ తీవ్రమైన డ్రాప్ ఉండదు. కానీ దసరా అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదించిన ట్రెండ్ ని సూచిస్తున్నాయి.

ఇప్పటికే లక్ష్యానికి దగ్గరగా వెళ్లిపోయింది కాబట్టి టెన్షన్ పడాల్సిన పని లేదు కానీ ఇంకో రెండు వారాల రన్ సులభంగా దక్కాల్సిన టైంలో ఇప్పుడు జరిగే ఏ పరిణామమైనా విశ్లేషించుకోవాల్సిందే. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ టికెట్ రేట్ల పెంపు వసూళ్లలో కీలక భాగం పోషించింది. మల్టీప్లెక్సుల్లో 295 రూపాయలు గరిష్ట ధర పెట్టేయడంతో భారీ ఫిగర్లు నమోదయ్యాయి. అయితే వెంటనే తగ్గించేందుకు డిస్ట్రిబ్యూటర్లు సుముఖంగా లేకపోవడంతో దాని ప్రభావం వీక్ డేస్ లో పడుతుంది. దాని వల్లే అడ్వాన్స్ కన్నా ఎక్కువ కరెంట్ బుకింగ్ మీద ఆధారపడాల్సి ఉంటుంది.

ఇవాళ్టి నుంచి పదో తరగతి చివరి వార్షిక పరీక్షలు మొదలయ్యాయి. ఆ పిల్లలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం థియేటర్లకు దూరంగా ఉంటారు. దీని ఎఫెక్ట్ కలెక్షన్ల మీద ఉంటుంది. తర్వాత శుక్రవారం ఒకే రోజు కిరణ్ అబ్బవరం మీటర్, రవితేజ రావణాసుర ఒకేసారి రిలీజ్ కానున్నాయి. వాటి టాక్ దసరాకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఏప్రిల్ 7 తేలుతుంది. నాని అభిమానుల చూపు వంద కోట్ల గ్రాస్ మీద ఉంది. ఇంకో పదహారు కోట్లే దూరం కాబట్టి చేరుకోవడం గ్యారెంటీనే. న్యాచురల్ స్టార్ కెరీర్ లో అతి పెద్ద మైలురాయికి రంగం సిద్ధమవుతోంది.