చోళ సామ్రాజ్యంపై కుట్రల నీడలు

తమిళనాట మాత్రమే సంచలన విజయం నమోదు చేసుకుని మిగిలిన చోట్ల ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయిన పొన్నియిన్ సెల్వన్ 1 సీక్వెల్ కోసం తెలుగులో పెద్దగా ఆసక్తి లేదు కానీ కోలీవుడ్ లో మాత్రం ఓ రేంజ్ లో హైప్ ఉంది. రెండో భాగంలోనే అసలు కథ ఉందని టీమ్ చెబుతున్న నేపథ్యంలో పీఎస్ 2 మీద ఓ మోస్తరు అంచనాలైతే ఉన్నాయి. నిన్న రాత్రి చెన్నైలో అంగరంగ వైభవంగా మ్యూజిక్ లాంచ్ తో పాటు ట్రైలర్ ఈవెంట్ జరిగింది. యూనిట్ మొత్తం హాజరై ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ నైట్ తో అభిమానులను అలరించింది

ఇందులో కథేంటో చూపించేశారు. అరుళ్ మొజి(జయం రవి) చనిపోయాడనే వార్త తెలిశాక చోళ సామ్రాజ్యంలో ముసలం పుడుతుంది. దాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని కరికాలన్(విక్రమ్)తో పాటు పల్లవన్(విక్రమ్ ప్రభు)లు తమ మద్దతుదారులతో పావులు కడుపుతారు. ఇది ఇష్టం లేని నందిని(ఐశ్వర్య రాయ్)ఎలాగైనా సరే కరికాలన్ హత్య చేసైనా సరే తన లక్ష్యం నెరవేర్చుకోవాలని పధకం పన్నుతుంది. ఇంకోవైపు బుద్దుల ఆశ్రమంలో తల దాచుకున్న అరుళ్ మొజి వెనక్కు వచ్చి వందియదేవన్(కార్తీ)తో కలిసి యుద్ధానికి సిద్ధపడతాడు. ఆ తర్వాత జరిగేదే పీఎస్ 2

విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇందులో గ్రాండియర్ ఎక్కువగా కనిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చింది. అయితే తెలుగు ఆడియన్స్ కి అర్థమయ్యేలా ఇందులో సంక్లిష్టత పాలు దర్శకుడు మణిరత్నం ఏ మేరకు తగ్గించారనేది సినిమా చూశాకే అర్థమవుతుంది. వార్ ఎపిసోడ్లు గట్రా భారీగా ఉన్నాయి. మొత్తానికి మనకు విపరీతమైన ఎగ్జైట్ మెంట్ గురి చేసేలా లేదు కానీ కంటెంట్ కనక కరెక్ట్ గా కనెక్ట్ అయితే పీఎస్ 2 వర్కౌట్ కావొచ్చు. ఏప్రిల్ 28న అఖిల్ ఏజెంట్ తో పాటు పొన్నియిన్ సెల్వన్ 2 థియేటర్లలో రానుంది