విక్టరీ వెంకటేష్ దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్లో రూపొందుతున్న సైంధవ్ విడుదల తేదీని ప్రకటించి దగ్గుబాటి అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే సంక్రాంతికి వచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఫ్యాన్స్ లో వ్యక్తమవుతున్నప్పటికీ నిజానికి సైంధవ్ బృందం ఇలా నిర్ణయించుకోవడం వెనుక తెలివైన ఎత్తుగడ ఉంది.
ఆ నెల చివరి రెండు వారాల్లో చెప్పుకోదగ్గ టాలీవుడ్ సినిమాలేవీ షెడ్యూల్ చేయలేదు. క్రిస్మస్ సెలవులతో కూడిన లాంగ్ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద మంచి అవకాశం ఇస్తుంది. పైగా డిసెంబర్ 14 వెంకటేష్ పుట్టినరోజు. వారం రోజులకే సైంధవ్ వచ్చేస్తుంది కాబట్టి సెలెబ్రేట్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. జనవరిలో రావడం వల్లే రిస్క్ ఎక్కువ. ఎందుకంటే నువ్వా నేనాని క్రేజీ మూవీస్ తలపడుతున్నాయి.
మహేష్ బాబు, ప్రభాస్ ఆల్రెడీ బరిలో దిగారు. కమల్ లేదా చరణ్ ఎవరో ఒకరు రావడం దాదాపు ఖాయమే. నాగార్జున కూడా బంగార్రాజు సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఇన్నిటి మధ్య ట్రై చేయడం కంటే సేఫ్ గా సోలోగా రావడమే ఉత్తమ మార్గం. అందుకే అన్ని ఆలోచనల తర్వాతే ఫైనల్ చేశారు. దీంతో గత ఏడాది రెండు సినిమాలు ఎఫ్3, ఓరి దేవుడాతో పలకరించిన వెంకటేష్ 2023లో ఒకదానితో పరిమితమవుతారు.
రానా నాయుడు వెబ్ సిరీస్ కాబట్టి కౌంట్ చేయలేం. మెడికల్ బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ రివెంజ్ డ్రామాగా సైంధవ్ రూపొందుతోందని ఇన్ సైడ్. వెంకీతో తలపడే నవాజుద్దీన్ సిద్ధిక్ పాత్ర నచాలా ఇంటెన్స్ గా ఉంటుందట. చాలా గ్యాప్ తర్వాత వెంకీ సీరియస్ సబ్జెక్టులో నటిస్తున్నారు. హిట్ సిరీస్ తో రెండు హిట్లు అందుకున్న శైలేష్ కొలనుకి మూడో సినిమాకే పెద్ద స్టార్ హీరోతో చేయాల్సి రావడం భారీ ప్రమోషన్. ఇదయ్యాక నానితో హిట్ 3 థర్డ్ కేస్ పనులు మొదలుపెట్టొచ్చు.