ఆరెంజ్.. ఈ పేరు ఎత్తితే మెగా అభిమానులకు ఒక రకమైన గగుర్పాటు కలిగేది మొన్నటి వరకు. ‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్‌తో రెండో సినిమాకే కెరీర్ పీక్స్‌ను అందుకున్న రామ్ చరణ్.. ఆ తర్వాత చేసిన చిత్రమిది. ఆడియో మెగా హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది.
ఏదో ఆశించి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు.. బోరింగ్‌గా, సీరియస్‌గా సాగిన ఈ ప్రేమకథను స్వీకరించలేకపోయారు. బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ అయింది ‘ఆరెంజ్’. ఐతే ఇలాంటి సినిమాకు రిలీజైన 13 ఏళ్ల తర్వాత స్పెషల్ షోలు వేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల నుంచి ఈ షోలు నడుస్తున్నాయి.
మూడు రోజుల్లో మొత్తం అన్ని షోల నుంచి రూ.2.12 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ‘ఆరెంజ్’. ఇంకా షోలు కొనసాగుతుండటంతో వసూళ్లు మరింత రానున్నాయి. ఒక డిజాస్టర్ మూవీకి ఇప్పుడు హౌస్ ఫుల్స్ పడటం, ఇంత గ్రాస్ రావడం విశేషమే. ‘ఆరెంజ్’ రిలీజైనపుడు ఈ సినిమాను మెచ్చిన వారూ ఉన్నారు. ఇది మరీ అడ్వాన్స్డ్‌గా ఉందని.. ఒక పదేళ్ల తర్వాత వస్తే బాగుండేదని కొందరు అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే.. ఆ మాటలు నిజమే అనిపిస్తోంది. ఈ మాత్రం ప్రేక్షకులు అప్పట్లో సినిమాను అర్థం చేసుకుని ఆదరించి ఉంటే.. ‘ఆరెంజ్’ అంతటి చేదు అనుభవాన్ని మిగిల్చేది కాదు. ఈ సినిమా దెబ్బకు నాగబాబు సినిమాల నిర్మాణమే మానుకున్నారు. ‘ఆరెంజ్’ వల్ల తలెత్తిన నష్టాల పుణ్యమా అని ఒక దశలో తనకు ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చినట్లు నాగబాబు చెప్పడం తెలిసిన సంగతే.