అదేంటి ఎప్పుడో వచ్చిన సినిమా ఇప్పుడు కొత్తగా రికార్డులు సృష్టించడం ఏమిటనుకోకండి. ఇది అక్షరాలా నిజం. యుట్యూబ్ లో ఏ ఇండియన్ మూవీకి సాధ్యం కాని రీతిలో జయ జానకి నాయక 709 మిలియన్ల వ్యూస్ తో నెంబర్ వన్ స్థానంలో ఠీవిగా నిలుచుంది. అప్లోడ్ చేసిన నాలుగు సంవత్సరాలకే ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం. తర్వాత ర్యాంకుల్లో దగ్గరగా కెజిఎఫ్ చాఫ్టర్ వన్ హిందీ డబ్ 692 మిలియన్లతో రెండో ప్లేస్ లో ఉంది.
మరే భారతీయ చిత్రాలు వీటి దరిదాపుల్లో లేవు. చరిత్ర సృష్టించిన షోలే, హం ఆప్కె హై కౌన్ లాంటివి కనీసం టచ్ చేసే సాహసం చేయలేదు. దీన్ని బట్టి మన డబ్బింగ్ మూవీస్ ని నార్త్ ఆడియన్స్ ఏ రేంజ్ లో నెత్తినబెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇవే కాదు అయిదు వందల మిలియన్ల క్లబ్బులో చేరిన వాటిలో కవచం, నేను శైలజ, హలో గురు ప్రేమ కోసమే, అఆ లాంటివి చాలానే ఉన్నాయి.
ఇక అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్స్ సంగతి సరేసరి. సాయిశ్రీనివాస్ కోరిమరీ బాలీవుడ్ డెబ్యూ చేయడానికి కారణం ఇదే. ఆన్ లైన్లో, శాటిలైట్ ఛానల్స్ తన సినిమాలకు దక్కుతున్న విపరీతమైన ఆదరణ చూసే థియేటర్ ఎక్స్ పీరియన్స్ ద్వారా అక్కడి ప్రేక్షకులకు దగ్గరవ్వాలని డిసైడ్ అయ్యాడు. అందుకే రాజమౌళి కథను తీసుకున్నాడు.
ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక మన హీరోల పాత సినిమాలకు బాగా డిమాండ్ ఏర్పడుతోంది. ఓటిటిలు ఎక్కువయ్యాక ప్రతి సినిమా యూట్యూబ్ లో దొరకడం లేదు. చాలా మటుకు యాప్స్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్ప చూడలేని పరిస్థితి నెలకొంది. నిన్నా మొన్నటి దాకా అన్ని ఉచితంగా అందుబాటులో ఉంచిన ఈటీవీ ఇటీవలే డబ్బులు కట్టి చూడమనే ప్లాన్ ని లాంచ్ చేసింది. రాబోయే రోజుల్లో ఎంటర్ టైన్మెంట్ కి సంబంధించి ఫ్రీ అనే మాట ఉండకపోవచ్చు. మొత్తానికి జయ జానకి నాయక రీచ్ చూస్తుంటే బోయపాటి శీనుకి మాస పల్స్ మీద ఎంత పట్టుందో అర్థమవుతుంది.