నాగ్ వెంకీ అంత రిస్క్ చేయగలరా?

ఇంకా తొమ్మిది నెలలు ఉండగానే 2024 సంక్రాంతి అప్పుడే వేడెక్కిపోతోంది. ఆలస్యం చేస్తే మంచి సీజన్ మిస్ అవుతుందనే ఉద్దేశంతో పెద్ద హీరోల సినిమాలన్నీ ముందుగానే కర్చీఫ్ వేసుకుంటున్నాయి. ప్రభాస్ ప్రాజెక్ట్ కె గతంలోనే జనవరి 12 తీసేసుకుంది. నిన్న మహేష్ బాబు త్రివిక్రమ్ కోసం 13ని బ్లాక్ చేశారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ డేట్ ఇవాళ సాయంత్రంలోపు తేలనుంది.

ఇది ఉంటే పోటీ ఇంకా రసవత్తరంగా మారుతుంది. లేదూ వేసవికి వెళ్తే మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ ఇంకొంత కాలం పొడిగించాల్సి వస్తుంది. అయితే ట్విస్టులు ఇక్కడితో ఆగిపోలేదు. వెంకటేష్ దర్శకుడు శైలేష్ కొలను కాంబోలో రూపొందుతున్న సైంధవ్ ని జనవరి 14కి తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో టీమ్ సీరియస్ గానే ఉందట.

రెగ్యులర్ షూటింగ్ ఈ వారంలోనే మొదలుపెట్టుకోబోతున్న ఈ మూవీ శైలేష్ రెగ్యులర్ బడ్జెట్ లకు భిన్నంగా భారీ ఖర్చుతో రూపొందుతోంది. అందుకే నవాజుద్దీన్ సిద్ధిక్ లాంటి టాప్ బాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకొచ్చారు. నిర్మాణానికి కనీసం ఏడు నెలల సమయం కోరడంతో పొంగల్ బరిలో దిగితే బాగుంటుందనే ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశలో ఉంది. త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఇక నాగార్జున రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ని డైరెక్టర్ గా లాంచ్ చేస్తున్న మూవీ తాలూకు రీమేక్ గొడవ దాదాపు కొలిక్కి వచ్చినట్టేనని ఇన్ సైడ్ టాక్. దీని కోసం నాగ్ ఆల్రెడీ కొత్త లుక్ లోకి వెళ్లిపోయారు. దాని తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మలయాళం హిట్ పొరింజు మరియం జొస్ మూల కథను తీసుకుని మన నేటివిటీకి అనుగుణంగా మార్చుకున్నారు. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు లాంటి విలేజ్ డ్రామాలు సంక్రాంతికి వచ్చే మెప్పించాయి కాబట్టి కింగ్ కన్ను జనవరి మీదే ఉందట. మరి ఇంత రిస్క్ నిజంగా వెంకీ నాగ్ లు తీసుకుంటారా వెయిట్ అండ్ సీ.