‘శాకుంతలం’ను రిజెక్ట్ చేసిన సామ్

టాలీవుడ్ చరిత్రలోనే చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్‌ను సమంత సొంతం చేసుకుంది. ఆమెను నమ్మి మంచి బడ్జెట్లు పెట్టి వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మిస్తున్నారు నిర్మాతలు. వాటికి మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి.

యుటర్న్ ఓ మోస్తరుగా ఆడితే.. ఓ బేబీ, యశోద చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ లాంటి భారీ చిత్రం తెరకెక్కింది. ఇంకో 20 రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సమంత ప్రమోషన్ల సందడి మొదలుపెట్టింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె.. ‘శాకుంతలం’ కథ చెప్పినపుడు తాను చేయలేనని దర్శక నిర్మాత గుణశేఖర్‌కు చెప్పినట్లు వెల్లడించింది.

‘‘అవును. ముందు గుణశేఖర్ గారు నాకీ కథ చెప్పగా.. నేను చేయలేనని సున్నితంగా తిరస్కరించాను. నేను ఇలాంటి సినిమాకు న్యాయం చేయలేనని అనుకున్నా. కానీ గుణశేఖర్ గారు నా ఆలోచనను మార్చి ఈ సినిమా చేయించారు. ఈ సినిమా మిస్సయి ఉంటే నేనొక పెద్ద కలను నెరవేర్చుకోలేకపోయేదాన్ని’’ అని సమంత అంది.

ఇక మయోసైటిస్ వ్యాధితో తన పోరాటం గురించి సామ్ వివరిస్తూ.. ‘‘యశోద సినిమా చేస్తున్న సమయంలో అనారోగ్యం పాలయ్యాను. ఒక టైంలో ఓపిక బాగా తగ్గిపోయింది. చాలా మందులు వాడుతూ నీరసపడిపోయేదాన్ని. మందులేసుకుంటూనే చిత్రీకరణకు హాజరయ్యా, ప్రమోషన్లు కూాడా చేశా. కానీ తర్వాత కోలుకున్నా. ఇప్పుడు అంతా బాగుంది. ‘శాకుంతలం’ ప్రమోషన్లు బాగానే చేయగలుగుతున్నా. ‘ఖుషి’ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నా’’ అని సామ్ చెప్పింది.