సుకుమార్‌ను నాని కించపరిచాడా?


నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా ‘దసరా’ను ప్రమోట్ చేసే క్రమంలో సుకుమార్ గురించి చేసిన ఒక వ్యాఖ్య వివాదాస్పదం అయింది. ఈ సినిమాను కొన్ని వారాల నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రమోట్ చేస్తున్నాడు నాని.

ఈ సందర్భంగా ఒక బాలీవుడ్ మీడియా సంస్థ ప్రతినిధి అతణ్ని ఆసక్తికర ప్రశ్న అడిగాడు. మిగతా స్టార్ హీరోలు పెద్ద పెద్ద దర్శకులతో పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే.. మీరేంటి ఒక కొత్త దర్శకుడి చిత్రంతో (దసరా గురించి ప్రస్తావిస్తూ) పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ అయ్యారు అని అడిగాడు.

దీనికి నాని బదులిస్తూ.. ‘”పెద్ద దర్శకులకు వాళ్ల సొంత ఇండస్ట్రీలో ఉన్న పేరు వేరే ఇండస్ట్రీలో లేదు కదా? అంటే వాళ్లు వేరే పరిశ్రమకు వెళ్తే అక్కడ కొత్త అన్నమాటే. సుకుమార్ గారికి తెలుగులో గొప్ప పేరు ఉండొచ్చు. కానీ ‘పుష్ప’ తర్వాతే ఆయనకు మిగతా ఇండస్ట్రీల్లో పాపులారిటీ వచ్చింది. నా డైరెక్టర్ ఇప్పుడు అన్ని చోట్లా కొత్తవాడే. కానీ ‘దసరా’ తర్వాత అతడికి పేరొస్తుంది” అని వ్యాఖ్యానించాడు నాని.

ఐతే ఉదాహరణ కింద సుకుమార్ పేరు చెప్పి ఆయన్ని కించపరిచాడని, నానికి పొగరెక్కువైందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ వివాదంపై నాని స్పందించాడు. తాను తన దర్శకుడిని సపోర్ట్ చేస్తూ మంచి ఉద్దేశంతో చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకున్నారని.. సుకుమార్‌ను తక్కువ చేసే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని.. ఆయనంటే తనకు ఎంతో గౌరవం ఉందని నాని స్పష్టం చేశాడు. ‘దసరా’తో దర్శకుడిగా పరిచయం అవుతున్న శ్రీకాంత్.. సుకుమార్ శిష్యుడే కావడం గమనార్హం.