మూడు వారాలకే ఓటిటిలో బలగం

సరిగ్గా ఇరవై రోజులు పూర్తి చేసుకోవడం ఆలస్యం బలగం ఓటిటిలో వచ్చేస్తోంది. కాకపోతే ఇక్కడో మెలిక ఉంది. ఇండియా కాకుండా బయట దేశాల్లో విస్తృతమైన నెట్ వర్క్ ఉన్న సింప్లీ సౌత్ ద్వారా ఇవాళ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ జరుపుకోనుంది. అంటే మన దగ్గర తప్ప ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎక్కడైనా సినిమా చూసేయొచ్చు. ఇక్కడి హక్కులు తీసుకున్న ప్రైమ్ కూడా ఏమైనా ట్విస్టు ఇచ్చి హఠాత్తుగా రిలీజ్ చేస్తే చెప్పలేం. గతంలో ఇలా జరిగిన దాఖలాలున్నాయి. మాములుగా ఒకేసారి అన్నిటిలో వచ్చేలా సదరు సంస్థలు ప్లాన్ చేసుకుంటాయి.

బలగం విజయవంతంగా మూడో వారం పూర్తి చేసుకుంది. నైజామ్ లో స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా 21 కోట్లకు పైగా గ్రాస్ ఇచ్చిన బలగం అందులో షేర్ ని పది కోట్లకు పైగా థియేటర్ల నుంచి రాబట్టింది. కేవలం రెండు కోట్లలోపే జరిగిన బిజినెస్ కి నిర్మాత దిల్ రాజుకి కాసుల పంట పండించింది. నిన్న ఉగాది రోజున దాస్ కా ధమ్కీ, రంగమార్తాండ లాంటి కొత్త రిలీజులు ఉన్నప్పటికీ బలగం డీసెంట్ గా హోల్డ్ చేయడం విశేషం. ఇంకో వారంలో నాని దసరా వచ్చేస్తుంది కాబట్టి ఇక అక్కడి నుంచి బలగం ఫైనల్ రన్ కు వచ్చేసినట్టే. ఎక్కువ ఆశించలేం

ఇంత విజయాన్ని ముందే ఊహించకపోవడం వల్ల మూడు వారాల అగ్రిమెంట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఇండియాలో స్ట్రీమింగ్ అవ్వకపోయినా ఆన్ లైన్ మార్గాలు బోలెడున్నాయి కాబట్టి ఏదో ఒక రూపంలో ఆ ప్రింట్ ని మనవాళ్ళు సైతం చూసేస్తారు. ఈ నెలలో ఇప్పటిదాకా మంచి టాక్ తో కమర్షియల్ గా కంటెంట్ పరంగా యునానిమస్ హిట్ కొట్టింది బలగం ఒక్కటే. అయినా ఎనిమిది వారాల గడువుండాలని ఆ మధ్య తెగ హడావిడి చేసిన నిర్మాతల్లో ఏ ఒక్కరు దానికి కట్టుబడటం లేదు. మహా అయితే నెలన్నరకు మించి గ్యాప్ ఉండేందుకు ఓటిటిలు ససేమిరా అంటున్నాయి