ప్ర‌కాష్ రాజ్ ఎక్క‌డ‌?

ఇంకో రెండు రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది రంగ‌మార్తాండ సినిమా. ఒక‌ప్పుడు వ‌రుస‌బెట్టి క్లాసిక్స్ అందించి, చాలా ఏళ్ల నుంచి స‌రైన విజ‌యం లేక ఇబ్బంది ప‌డుతున్న‌ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. మేకింగ్ ద‌శ‌లోనే ఈ సినిమా చాలా ఆల‌స్యం అయింది. ఆ త‌ర్వాత సినిమాకు బిజినెస్ జ‌ర‌గ‌క మ‌రింత ఆల‌స్యం త‌ప్ప‌లేదు.

ఐతే అన్ని అడ్డంకుల‌నూ అధిగ‌మించి ఉగాది రోజు సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు బ‌జ్ పెంచ‌డం కోసం ఫిలిం సెల‌బ్రెటీల‌తో పాటు మీడియా వాళ్ల‌కు వ‌రుస‌బెట్టి ప్రిమియ‌ర్స్ వేశారు. చూసిన వాళ్లంద‌రూ సినిమాను మెచ్చుకున్నారు. అయినా స‌రే సినిమాకు ఇంకా బ‌జ్ అవ‌స‌ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప్రేక్ష‌కులు ఈ సినిమా చూసేందుకు ఏమాత్రం థియేట‌ర్ల‌కు వ‌స్తారో అన్న సందేహాలు క‌లుగుతున్నాయి.

రిలీజ్ ముంగిట సినిమాకు బ‌జ్ పెంచే దిశ‌గా ప్ర‌మోష‌న్లు కొంచెం గ‌ట్టిగా చేయాల్సింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ రెగ్యుల‌ర్‌గా సినిమాల‌కు చేసిన‌ట్లు ఈ చిత్రానికి ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌లేదు. చిన్న ప్రెస్ మీట్ ఏదో పెట్టారు. అందులో కృష్ణ‌వంశీ కాకుండా పేరున్న వ్య‌క్తి ఎవ‌రూ లేరు.

సినిమాలో లీడ్ రోల్ చేసిన ప్ర‌కాష్ రాజ్ ప్రెస్ మీట్లో పాల్గొన‌లేదు. అంతే కాక రంగ‌మార్తాండ గురించి ఆయ‌న మీడియా వాళ్ల‌ను క‌లిసి ఇంట‌ర్వ్యూలు కూడా ఏమీ ఇవ్వ‌డం లేదు. కృష్ణ‌వంశీతో వ్య‌క్తిగ‌తంగా ప్ర‌కాష్ రాజ్‌కు మంచి స్నేహం ఉంది.

కానీ త‌న ప్ర‌మోష‌న్ అవ‌స‌ర‌మైన స్థితిలో ఈ విల‌క్ష‌ణ న‌టుడు హ్యాండ్ ఇచ్చేశాడు. ప్ర‌కాష్ రాజ్‌కు జోడీగా న‌టించిన ర‌మ్య‌కృష్ణ, సినిమాలో త‌న ఇమేజ్‌కు భిన్న‌మైన పాత్ర చేసిన బ్ర‌హ్మానందం సైతం ప్ర‌మోష‌న్ల‌కు దూరంగానే ఉండ‌టం రంగ‌మార్తాండ‌కు మైన‌స్ అవుతోంది.