షోల మీద షోలు న్యాయం జరగాల్సిందే

ఎల్లుండి విడుదల కాబోతున్న కృష్ణవంశీ తన రంగమార్తాండ విడుదల పట్ల చాలా ఎగ్ జైటింగ్ గా ఉన్నారు. బహుశా అయన కెరీర్ లో ఏ సినిమాకు ఇన్నేసి మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఎవరు అడిగినా నో అనకుండా, అలసిపోకుండా యాంకర్ల ముందు తను పడిన కష్టం గురించి ఎన్నో సంగతులు చెబుతూనే ఉన్నారు. ఇది ఒక ఎత్తయితే గత వారం పది రోజులు నుంచి నాన్ స్టాప్ గా స్పెషల్ ప్రీమియర్లు వేస్తూనే వచ్చారు. మీడియాకు ఒకసారి. ఇండస్ట్రీ సెలబ్రిటీలకు మరోసారి, బయ్యర్లకు ఒక షో, సోషల్ మీడియాతో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులకు మరోసారి ఇలా ఆటలు వేస్తూనే వచ్చారు. నిన్న మధ్యాహ్నంతో ఇవి పూర్తయ్యాయి.

ఫీడ్ బ్యాక్ బ్రహ్మాండంగా ఉంది. ఈ ప్రీమియర్లకు టికెట్లు అమ్మలేదు. ప్రసాద్ ల్యాబ్స్ లో దానికయ్యే అద్దెతో పాటు క్యూబ్ చార్జీలు, వచ్చినవాళ్ళకు టీ స్నాక్స్ మొత్తం అంతా కృష్ణవంశీ జేబులో నుంచే వెళ్లిందని ఇన్ సైడ్ టాక్. ప్రతి ఒక్కరితో దగ్గరుండి ఫీడ్ బ్యాక్ తీసుకుని దాన్ని మెయిన్ స్ట్రీమ్ తో పాటు యూట్యూబ్ ఛానల్స్ కిచ్చి ప్రచారానికి తోడ్పడమంటున్నారు. ఇది అమ్మానాన్నలతో కలిసి చూడదగ్గ చిత్రమని అందరూ కితాబిస్తున్నారు. అయితే పిలిచి మరీ షో చూపించినందుకు కృతజ్ఞతగా ఇలా అంటున్నారా లేక నిజంగా అంత గొప్ప సినిమానా అనేది ఎల్లుండి తేలుతుంది.

కృష్ణవంశీ భవిష్యత్తు ఒకరకంగా రంగమార్తాండ విజయంతో ముడిపడి ఉంది. అన్నం అనే మరో స్క్రిప్ట్ సిద్ధంగా ఉంచుకున్నారు. ఇప్పుడు తన సినిమాను టోకున కొనేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రితోనే ఉండొచ్చనే టాక్ ఉంది కానీ అదెంతవరకు ముందుకెళ్తుందనేది రంగమార్తాండకు వచ్చే పబ్లిక్ రెస్పాన్స్ కి బట్టి ఉండొచ్చు. చాలా హెవీ ఎమోషన్ తో రూపొందిన ఎమోషనల్ డ్రామాకు బుకింగ్స్ చాలా నెమ్మదిగా ఉన్నాయి. బలగం లాగా టాక్ వస్తే తప్ప ఊపందుకోదు. పైగా దాస్ కా ధమ్కీ పోటీలో ఉంది. వారం తిరగ్గానే నాని దసరాతో దిగుతాడు. సో న్యాయం జరగాలంటే సినిమా ఓ రేంజ్ లో హిట్టవ్వాలి.