300 ఎక‌రాలు పోగొట్టుకున్న కీర‌వాణి తండ్రి


శివ‌శ‌క్తి ద‌త్తా.. కీర‌వాణి తండ్రిగా గుర్తింపు పొంద‌డానికంటే ముందు ర‌చ‌యిత‌గా టాలీవుడ్లో ఆయ‌న బాగానే పాపుల‌ర్. త‌న సోద‌రుడు విజ‌యేంద్ర ప్ర‌సాద్‌తో క‌లిసి ఆయ‌న జాన‌కి రాముడు స‌హా ప‌లు హిట్ చిత్రాల‌కు క‌థ అందించారు. త‌న కొడుకు నాటు నాటు పాట‌కు గాను ఆస్కార్ అవార్డు అందుకున్న నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

కీర‌వాణి త‌న కెరీర్లో చేసిన ఎన్నో పాట‌ల‌తో పోలిస్తే నాటు నాటు అంత గొప్ప పాటేమీ కాద‌ని.. ఇందులో సంగీతం ఎక్క‌డుంద‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి. ఈ సంగతిలా ఉంచితే.. ఒక‌ప్పుడు వైభ‌వం చూసిన త‌మ కుటుంబం.. త‌ర్వాత సినిమాల్లో డ‌బ్బులు పోగొట్టుకుని ఎంత‌టి ద‌య‌నీయ స్థితిని ఎదుర్కొందో శివ‌శ‌క్తి ద‌త్తా చెప్పుకొచ్చారు.

నాకు సినిమా అంటే ప్యాష‌న్, మేం న‌లుగురు అన్న‌ద‌మ్ములం. మేమంతా తుంగ‌భ‌ద్ర ప్రాంతానికి ల‌వ‌ల వెళ్లాం. అక్క‌డ 16 ఏళ్ల పాటు ఉన్నాం. ఆ ప్రాంతంలో నేను 300 ఎక‌రాలు కొన్నాను. కానీ సినిమాల కోసం ఆ భూమి అంతా అమ్మేశా. చివ‌రికి ఈ రోజు పూట గ‌డ‌వ‌డం ఎలా అనే ప‌రిస్థితికి వ‌చ్చాం. ఆ స‌మ‌యంలో నేను, విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌లిసి మంచి మంచి క‌థ‌లు రాశాం. కొండ‌వీటి సింహం, జాన‌కి రాముడు లాంటి హిట్ సినిమాల‌కు మేం ప‌ని చేశాం.

ఐతే మేం కుదురుకోవ‌డానికి ముందు కీర‌వాణి.. చ‌క్ర‌వ‌ర్తి ద‌గ్గ‌ర ప‌ని చేసేవాడు. అత‌ను తెచ్చిన డ‌బ్బుల‌తోనే ఇల్లు గ‌డిచేది. కీర‌వాణి అంటే నాకు పంచ ప్రాణాలు. మూడో ఏటే అత‌డికి సంగీతం నేర్పించా. త‌న టాలెంట్ చూసి ఆశ్చ‌ర్య‌పోతుంటా. కానీ నాటు నాటు పాట నాకు అంత‌గా న‌చ్చ‌లేదు. ఇందులో సంగీతం ఎక్క‌డుంద‌న్న‌ది నా ప్ర‌శ్న‌. ఐతే ఇన్నాళ్లూ కీర‌వాణి చేసిన కృషికి ఈ పాట‌కు ఆస్కార్ రూపంలో ఫ‌లితం ద‌క్కింద‌నుకుంటున్నా అని శివ‌శ‌క్తి ద‌త్తా అన్నారు.