సౌత్ సినిమా డామినేషన్ తో ఇప్పటికే ఉడికిపోతున్న బాలీవుడ్ మీద తాజాగా నాటు నాటుకి ఆస్కార్ రావడం గాయం మీద కారం చల్లినట్టు అయ్యింది. అంతర్జాతీయ వేదిక మీద ఎంఎం కీరవాణి – చంద్రబోస్ లు అవార్డు అందుకోవడం, ఈవెంట్ లో ఫారిన్ డాన్సర్లతో లైవ్ పెర్ఫార్మన్స్ ఇప్పించడం లాంటివి గొప్ప జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. దీపికా పదుకునే ఆర్ఆర్ఆర్ గురించి చేసిన వ్యాఖ్యానం సైతం వీడియో రూపంలో వైరల్ అయ్యింది. ప్రధాని నరేంద్రమోడీతో మొదలుకుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ సీఎంల దాకా అందరూ అభినందనలు అందజేశారు.
విచిత్రంగా నార్త్ నుంచి మాత్రం ఎలాంటి సెలబ్రిటీ అభినందనలు కనిపించడం లేదు. వేడుక జరిగి అయిదారు గంటలు దాటేసింది. సో విషయం తెలియకుండా ఎవరూ లేరు. ముగ్గురు ఖాన్లతో సహా ఎవరూ ఇంకా రెస్పాన్డ్ అవ్వలేదు. మెగా ఫ్యామిలీతో ఎంతో అనుబంధం ఉన్న కండల వీరుడు సల్లు భాయ్ ఎందుకో మౌనాన్ని ఆశ్రయించాడు. మొన్నటి దాకా చరణ్ త్వరగా ఆస్కార్ తీసుకురా అని చెప్పిన షారుఖ్ సైతం సైలెంట్ గానే ఉన్నారు. ఇక అమీర్ సంగతి సరేసరి. హిందీకి సంబంధించిన ఏ ప్రముఖ దర్శకుడు నిర్మాత కంగ్రాట్స్ చెప్పిన ట్వీట్లు కానీ వీడియోలు కానీ లేవు.
దీన్ని బట్టి ఈ పరిణామాలను వారు జీర్ణించుకోలేకపోతున్నారని అర్ధమవుతోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ కన్నా ది ఎలిఫెంట్ విష్పరర్స్ సాధించిందే గొప్ప ఘనతన్న రేంజ్ లో కొందరు, అప్పుడెప్పుడో స్లండాగ్ మిలియనీర్ కి ఏఆర్ రెహమాన్ కు వచ్చింద పెద్దదని మరొకరు తమ అయిష్టాన్ని వేర్వేరు రూపాలలో బయట పెడుతున్నారు. వీటి వల్ల ఆర్ఆర్ఆర్ కు పోయేదేమీ లేదు కానీ భారతీయులందరూ గర్వపడాల్సిన ఇలాంటి అపురూప క్షణాలు వీలైనంత త్వరగా స్పందించాలి కానీ ఇలా మీనమేషాలు లెక్కబెట్టడం ఏమిటో. ఇండియా ప్రైమ్ మినిస్టర్ కన్నా బిజీగా ఉన్న వాళ్ళ గురించి ఇంతకన్నా ఏం చెబుతాం.