దృశ్యం 3 కొత్త ప్లాన్ అదిరింది

ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ని పరిచయం చేసి తీసిన అన్ని భాషల్లో అద్భుత ఫలితాన్ని దక్కించుకున్న దృశ్యం సినిమాది ప్రత్యేక స్థానం. మొదట మలయాళంలో మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్ దీన్ని రూపొందించినప్పుడు పెద్దగా అంచనాలు లేవు. హీరో ఇమేజ్ కు అనుగుణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ తీరా చూస్తే ఏకంగా మల్లువుడ్ రికార్డులను తిరగరాసే స్థాయిలో అది సాధించిన విజయం అంతా ఇంతా కాదు. విక్టరీ వెంకటేష్ టీనేజ్ అమ్మాయి తండ్రిగా నటించేందుకు వెనుకాడనంతగా మెప్పించడంతో ఇక్కడా రీమేక్ చేసి సక్సెస్ కొట్టారు.

హిందీలో అజయ్ దేవగన్ నేనేం తక్కువాని సేమ్ రిజల్ట్ అందుకున్నాడు. కానీ దృశ్యం 2 కరోనా వల్ల కొంత దారి మార్చుకోవాల్సి వచ్చింది. మలయాళం తెలుగు వెర్షన్ నిర్మాతల కమిట్ మెంట్లు, కరోనా పరిస్థితుల వల్ల డైరెక్ట్ ఓటిటికి వెళ్లిపోయాయి. రెస్పాన్స్ బ్రహ్మాండంగా వచ్చింది కానీ థియేటర్లో అయ్యుంటే రెవిన్యూ పరంగా ఎంత పెద్ద హిట్టో అర్థమయ్యేది. ఈసారి అజయ్ తొందరపడకుండా బాలీవుడ్ దృశ్యం 2ని తెలివిగా కొంత ఆలస్యం చేయించి బిగ్ స్క్రీన్ మీద కాసుల వర్షం కురిపించాడు. మూడో భాగానికి లీడ్ వదిలేసిన జీతూ జోసెఫ్ దాని స్క్రిప్ట్ పనులను పూర్తి చేశారట.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దృశ్యం 3 ఈసారి ఏకకాలంలో మూడు భాషల్లో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మోహన్ లాల్, అజయ్ దేవగన్ సంసిద్ధత వ్యక్తం చేయడంతో నెక్స్ట్ వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఓకే అయితే షూటింగ్ మొదలుపెట్టి రిలీజ్ దాకా అన్ని ఒకేసారి జరుగుతాయి. ఒకటి ముందు ఆ తర్వాత అనేలా రిలీజులు ఉండవు. దీనివల్ల స్టోరీ ప్లాట్ ఏంటి, ట్విస్టులేంటని ముందే లీకయ్యే గోల తప్పుతుంది. ఇది రెండో భాగానికే చేయాల్సింది కానీ ఏదైతేనేం థర్డ్ పార్ట్ మాత్రం మంచి నిర్ణయమే తీసుకున్నారు. త్వరలోనే ప్రకటన రావొచ్చు.