నయన్‌పై ఇంకో హీరోయిన్ ఆరోపణలు


సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద హీరోయిన్లలో నయనతార ఒకరు. ఆమెకున్న ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వేరే స్టార్ హీరోయిన్లు అసూయ పడే రేంజి ఆమెది. సౌత్‌ ఇండియా అనే కాదు.. మొత్తం ఇండియాలో తనలా పెద్ద ఎత్తున లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి, హిట్లు కొట్టిన వాళ్లు చాలా కొద్దిమందే కనిపిస్తారు. ఐతే కథానాయికగా పెద్ద రేంజికి వెళ్లాక నయనతారకు గర్వం పెరిగిందని అనే వాళ్లూ లేకపోలేదు. ఆంతరంగిక సంభాషణల్లో నయన్‌ను విమర్శించేవాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

బయటి సినిమాలు వేటికీ ప్రమోషన్లకు వెళ్లని ఆమె.. తన భర్త విఘ్నేష్ శివన్ తీసే సినిమాలను మాత్రం ప్రమోట్ చేయడంపై ఇప్పటికే చాలా విమర్శలున్నాయి. ఇదిలా ఉంటే.. ఒక సినిమాలో నయన్ ఫుల్ మేకప్‌తో హాస్పిటల్ బెడ్ సీన్ చేయడం మీద మాళవిక మోహనన్ ఆమె పేరెత్తకుండా విమర్శించడం ఆ మధ్య చర్చనీయాంశం అయింది.

కట్ చేస్తే.. ఇప్పుడు మరో మలయాళ హీరోయిన్ మమత మోహన్ దాస్ నయన్ పేరెత్తకుండా ఆమె మీద ఆరోపణలు గుప్పించింది. నయన్ వల్ల తాను ఓ సినిమాలో ఎలా కనిపించకుండా పోయానో వివరించింది మమత. రజినీకాంత్ నటించిన ఓ సినిమాలో తనను ఒక పాట కోసం తీసుకున్నారని.. ఐతే ఆ పాటను చిత్రీకరిస్తున్న విధానం చూసి.. తాను ఫ్రేమ్‌లో లేనని అర్థమైపోయిందని.. దీనికి కారణమేంటని తెలుసుకుంటే ఇంకో హీరోయిన్ ఉంటే తాను షూటింగ్‌కు రానని వేరే హీరోయిన్ కండిషన్ పెట్టినట్లు తెలిసిందని మమత చెప్పింది. ఆ పాట కోసం తాను నాలుగు రోజుల సమయాన్ని వృథా చేసుకున్నానని.. తెరపై పాటలో తాను అసలు కనిపించలేదని.. ఒక చోట వెనుక నుంచి మాత్రమే కనిపించానని మమత తెలిపింది.

మమత చెబుతున్నది ‘కథానాయకుడు’ సినిమా గురించే. అందులో ఒక పాటలో మమత ఒకట్రెండు క్షణాలు మాత్రమే మెరిసి మాయమైంది. ఈ పాటలో ప్రధానంగా కనిపించేది నయనతారే. ఈ సినిమాలో ఆమెది కూడా దాదాగాపు గెస్ట్ రోల్ లాంటిదే. ఈ పాటలో ఇంకో హీరోయిన్ హైలైట్ కాకూడదని నయన్ కండిషన్ పెట్టిందని మమత మాటల్ని బట్టి అర్థమవుతోంది.