ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ బడ్జెట్‌పై హాట్ కామెంట్స్


‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజై ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో నెలా నెలన్నర పాటు సందడి చేసిన సమయంలో కంటే.. ఆ తర్వాతే దాని గురించి అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ చర్చ జరిగింది. నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ రిలీజ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆ చిత్రాన్ని చూసి మైమరిచిపోయారు. నేటివ్ అమెరికన్స్.. హాలీవుడ్ ఫిలిం సెలబ్రెటీలు ‘ఆర్ఆర్ఆర్’ చూసి స్పందించిన తీరు అసామాన్యమైంది. ఇక అప్పట్నుంచి అంతర్జాతీయంగా ‘ఆర్ఆర్ఆర్’ సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి.

గోల్డెన్ గ్లోబ్ సహా పలు పురస్కారాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటడం.. ఆస్కార్ అవార్డులకు వివిధ విభాగాల్లో పోటీ పడటం.. ‘నాటు నాటు’ పాట నామినేషన్ కూడా సంపాదించడంతో ఈ సినిమా పేరు వరల్డ్ వైడ్ మార్మోగిపోయింది. జేమ్స్ కామెరూన్ అంతటి వాడు ‘ఆర్ఆర్ఆర్’ గురించి గొప్పగా మాట్లాడాడు.

మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా పేరు మార్మోగేలా చేసింది. కానీ ఈ సినిమాను ఆస్కార్ అవార్డుల్లో నిలబెట్టేందుకు చిత్ర బృందం పెట్టుకున్న బడ్జెట్ విషయమై టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు గుప్పించారు. ఆస్కార్ ప్రమోషన్ల కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీం ఇప్పటిదాకా 80 కోట్ల దాకా ఖర్చు పెట్టుకున్నట్లు ఒక సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ 80 కోట్లతో ఎనిమిదో పదో చిన్న సినిమాలు తీసేయొచ్చని.. ఈ డబ్బంతా వేస్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం ఫ్లైట్ టికెట్లు, ప్రమోషనల్ కార్యక్రమాలకే ఇంత ఖర్చు పెట్టారని ఆయనన్నారు.

ఐతే తమ్మారెడ్డి వ్యాఖ్యలను నెటిజన్లు చాలామంది తప్పుబడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ వల్ల ఇండియన్ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందని.. ఆస్కార్ అవార్డుల్లో సత్తా చాటితే అది దేశానికి గర్వకారణం అవుతుందని.. అలాగే రాజమౌళి తర్వాతి సినిమాలకు మరింత మార్కెట్ వస్తుందని.. కాబట్టి ఈ ఖర్చును వృథాగా భావించనక్కర్లేదని అభిప్రాయపడుతున్నారు.