ఇరాట్ట.. మలయాళంలో గత నెల విడుదలైన ఓ చిన్న సినిమా ఇది. జోసెఫ్, నాయట్టు లాంటి చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ జోజు జార్జ్ లీడ్ రోల్‌లో నటించిన సినిమా ఇది. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. మలయాళ ప్రేక్షకులు చిన్న హీరో, పెద్ద హీరో అని కానీ.. క్యారెక్టర్ రోల్స్ చేసే నటుడు లీడ్ రోల్ చేశాడని కానీ తేడా చూపించకుండా.. కథను బట్టి ఆదరిస్తుంటారు. ఇరాట్ట సినిమాను కూడా అలాగే హిట్ చేశారు.
థియేటర్లలో మంచి పలితాన్నందుకున్న ఈ చిత్రం.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత సరిగ్గా నెల రోజులకు, మార్చి 3న నెట్‌ఫ్లిక్స్ ద్వారా డిజిటల్‌గా రిలీజైంది. కొన్ని రోజుల్లోనే ఈ సినిమా మీద సోషల్ మీడియా పెద్ద చర్చ మొదలైంది. భాషా భేదం లేకుండా ఈ సినిమాను ప్రేక్షకులు విరగబడి చూస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన రోజు నుంచి ఈ సినిమా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద సినిమాలు, సిరీస్‌లను మించి ఇది ఆదరణ దక్కించుకుంటోంది. గత కొన్నేళ్లలో బాగా మలయాళ సినిమాలకు అలవాటు పడ్డ తెలుగు ప్రేక్షకులు.. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించిన పోస్టులతో హోరెత్తించేస్తున్నారు.
ఇటు ట్విట్టర్లో, అటు ఫేస్‌బుక్‌లో ఇరాట్ట గురించి పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రియుల చర్చల్లో ఈ సినిమా ప్రధానంగా ఉంటోంది. ఈ సినిమా గురించి జరుగుతున్న డిస్కషన్ చూసి తెలుగు మీడియా కూడా రివ్యూలు ఇస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ సెన్సేషనల్ అనే చెప్పాలి. అది చూసి జనాలకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి.
కొన్ని రోజుల పాటు వెంటాడే ఆ ట్విస్టును జీర్ణించుకోవడం అంత తేలిక కాదు. జోజు జార్జ్ ఎంత గొప్ప నటుడో ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. రోహిత్ కృష్ణన్ రూపొందించిన ఈ చిత్రంలో మన తెలుగమ్మాయి అంజలి మంచి పాత్రతో ఆకట్టుకోవడం విశేషం.