గత ఏడాది బాలీవుడ్ ఎంతో ఘనంగా గొప్పగా బాహుబలి రేంజ్ లో ప్రమోట్ చేసుకున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ వందల కోట్లు వసూలు చేసిన మాట వాస్తవమే కానీ మరీ ఆర్ఆర్ఆర్ కెజిఎఫ్ రేంజ్ లో ఆడలేదన్నది వాస్తవం. నిర్మాత కరణ్ జోహార్ భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ బ్లాక్ బస్టర్ దగ్గర ఆగిపోయింది కానీ పఠాన్ రేంజ్ లో ఇండస్ట్రీ నెంబర్ వన్ కాలేదు. ఇక్కడి ఆడియన్స్ సంగతి ఎలా ఉన్నా నార్త్ జనాలు దీన్ని బాగా ఆదరించారన్నది వాస్తవం. హీరో రన్బీర్ కపూర్ కు చాలా పేరొచ్చింది. అలియా భట్ తో పెళ్ళయాక కుర్రాడి స్పీడ్ పెరిగిందనే కామెంట్స్ ముంబై మీడియాలో వచ్చాయి.
వీటి సంగతలా ఉంచితే రేపు రన్బీర్ కపూర్ కొత్త సినిమా తూ ఝూటి మై మక్కర్ భారీ ఎత్తున విడుదల కాబోతోంది. సాంప్రదాయ శుక్రవారం రిలీజ్ సెంటిమెంట్ కి విరుద్ధంగా నిర్మాతలు లాంగ్ వీకెండ్ ప్లస్ హోలీ కోసం వెడ్ నెస్ డే ని ఎంచుకున్నారు. సాహో ఫేమ్ శ్రద్ధ కపూర్ హీరోయిన్ కాగా లవ్ రంజాన్ దర్శకుడు. కొన్నేళ్ల క్రితం లైంగిక వేధింపుల కేసులో తీవ్ర వివాదంలో చిక్కుకుని బయట పడింది ఇతనే. కట్ చేస్తే ఈ ఝూటి మక్కర్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సులు కలిపి 30 వేల టికెట్లు అమ్ముడుపోలేదని ట్రేడ్ టాక్.
ఇదో లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఘాటు సీన్లు బలంగానే దట్టించారని ట్రైలర్ చూశాక అర్థమయ్యింది. శ్రద్ధ కపూర్ సైతం ఒళ్ళు దాచుకోకుండా ఎక్స్ పోజింగ్ చేసింది. సహజంగానే యూత్ దీని పట్ల ఆకర్షితులు కావాలి. కానీ దానికి భిన్నంగా రెస్పాన్స్ ఇంత డల్ గా ఉండటం బయ్యర్లను ఖంగారు పెడుతోంది. ఎందుకంటే పఠాన్ వచ్చి నలభై రోజులు దాటేసింది. ఇప్పటిదాకా కనీసం దానికి పావు వంతు అందుకునే స్థాయిలో ఏ సినిమా రాలేదు. షెహజాదా దారుణంగా పోయింది. థియేటర్లు మళ్ళీ వెలవెలబోతున్నాయి. ఈ ఝూటి మక్కర్ బ్రహ్మాండంగా ఉందనే టాక్ వస్తే తప్ప నిలవడం కష్టం.