దసరా 100 కోట్ల లక్ష్యం సులభమే

అభిమానుల కంటే ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు మార్చి 30 విడుదల కాబోయే దసరా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే థియేటర్లను పూర్తిగా నింపేసే సినిమా వచ్చి మూడు వారాలు దాటేస్తోంది. ఇంకో ఇరవై రోజులు దాదాపు ఇదే పరిస్థితి కొనసాగనుంది. టికెట్ కౌంటర్లు నీరసంగా ఉన్నాయి. సార్ ఆల్రెడీ నెమ్మదించేసింది. వినరో భాగ్యము విష్ణుకథ ఫైనల్ రన్ ముగిసినట్టే. ఫిబ్రవరి చివరి వారంలో వచ్చినవి అడ్రెస్ లేకుండా పోయాయి. బలగం మరీ స్ట్రాంగ్ గా లేదు. బాగుందనే మాట స్ప్రెడ్ అవుతోంది. ఈ గ్యాప్ లో కబ్జా, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, బెదురులంక తప్ప చెప్పుకోదగ్గవి లేవు.

దసరా చాలా క్రేజీగా బిజినెస్ జరుపుకుంది. ఇంకా థియేటర్లలో అడుగుపెట్టకుండానే వంద కోట్ల మార్కు చేరుకుందని ఇండస్ట్రీ టాక్. ఒక్క డిజిటల్ డీల్స్ ద్వారా ముప్పై అయిదు కోట్లకు పైగానే వచ్చాయట. వర్కింగ్ స్టిల్స్, టీజర్ చూసే నెట్ ఫ్లిక్స్ చాలా ఫ్యాన్సీ మొత్తం ఆఫర్ చేసిందని వినికిడి. వాల్తేరు వీరయ్యను యాభై కోట్లకు కొన్న ఈ ఓటిటికి తర్వాత పెద్ద మొత్తం ఇదేనట. దీనికన్నా ఎక్కువగా డబ్బింగ్ రేట్ పలుకుతోంది. హిందీ తమిళ మలయాళం కన్నడ అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అవన్నీ కలిపి ఇంకో నలభై కోట్లయినా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

టాక్ పాజిటివ్ గా వచ్చి థియేటర్ రెవిన్యూ ఒక ముప్పై కోట్లు చేసినా చాలు దసరా సెంచరీ మైలురాయి అందుకుంటుంది. బ్లాక్ బస్టర్ అయ్యిందా హీనపక్షం యాభై కోట్ల షేర్ లాగేయొచ్చు. హైప్ అంతకంతా పెరుగుతున్న నేపథ్యంలో ఇదేమీ అసాధ్యం కాదు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. సంతోష్ నారాయణన్ సంగీతం ఇప్పటికే ఛార్ట్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. న్యాచురల్ స్టార్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా దసరా నిలిస్తే మాత్రం నాని మార్కెట్ అమాంతం రెట్టింపవుతుంది.