వెంకటేష్ మహా.. ఈ ఉదయం నుంచి తెలుగు సోషల్ మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన పేరు. ‘కేరాఫ్ కంచరపాలెం’తో దర్శకుడిగా పరిచయం అయిన ఇతను.. తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ, వివేక్ ఆత్రేయ, నందిని రెడ్డి, శివ నిర్వాణలతో కలిసి పాల్గొన్న ఒక రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమంలో కమర్షియల్ సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.
బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’లో లోపాల గురించి వెటకారంగా మాట్లాడడమే కాక.. కమర్షియల్ సినిమాలు తీయడం పెద్ద విషయమే కాదని, తాము కనుక ఇప్పుడు చేస్తున్న వైవిధ్యమైన సినిమాలు పక్కన పెట్టి ఒకసారి రంగంలోకి దిగితే ఇప్పుడు వస్తున్న కమర్షియల్ సినిమాలను మించి తీయగలమని అతను సవాలు విసిరాడు.
ఐతే తాము తీసే సినిమాల గురించి ఎన్ని గొప్పలు పోయినా ఓకే కానీ.. అందుకు కమర్షియల్ సినిమాలను కించపరిచేలా మాట్లాడాలా అంటూ నెటిజన్లు వెంకటేష్ మహా మీద విరుచుకుపడుతున్నారు. ఎక్కువమందికి నచ్చే సినిమాల మీద ఈ ఏడుపులేంటని వెంకటేష్‌ను ట్రోల్ చేస్తున్నారు. వెంకటేష్ ‘కేజీఎఫ్’ను తక్కువ చేసి మాట్లాడుతున్న సమయంలో ఇంద్రగంటి, వివేక్, నందిని, శివ గట్టిగా నవ్వడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నందిని ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది. కమర్షియల్ సినిమాల్లో ప్రయత్నాన్ని ప్రేక్షకులు మెచ్చడం వల్లే ఆ సినిమాలు పెద్ద సక్సెస్ అవుతాయని.. తమ చర్చలో ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని.. నిజానికి కమర్షియల్ సినిమా మీద ఒక సానుకూల చర్చనే తాము చేపట్టామని నందిని వెల్లడించింది.
ఎవరైనా ఇందుకు నొచ్చుకుని ఉంటే మన్నించాలని ఆమె కోరింది. ఐతే ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చూస్తుంటే.. వెంకటేష్ మహాకే మున్ముందు చాలా కష్టం అయ్యేలా ఉంది. తన వ్యాఖ్యలపై అతను కూడా క్షమాపణలు చెప్పక తప్పేలా లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates