అహింస విడుదల వెనుక మర్మమేమిటో

ఎట్టకేలకు దగ్గుబాటి అభిరాంని హీరోగా పరిచయం చేస్తూ తీసిన అహింస విడుదల తేదీని ఏప్రిల్ 7కి లాక్ చేసి అఫీషియల్ గా ప్రకటించారు. నెలల తరబడి వాయిదా పడుతూ వచ్చి ఎప్పుడు వస్తుందో అర్థం కాక దగ్గుబాటి ఫ్యాన్స్ ని అయోమయంలోకి నెట్టేసిన సురేష్ కాంపౌండ్ ఫైనల్ గా దానికి చెక్ పెట్టేశారు. తేజ లాంటి సీనియర్ దర్శకులు తెరకెక్కించినా వీలైనంత త్వరగా థియేటర్లలో తీసుకురావాలన్న చొరవ సురేష్ బాబు చూపించలేదు. లేట్ అవ్వడానికి ఇదీ కారణమే. తేజ రెగ్యులర్ ఫార్ములాలో సాగె ప్రేమకథే అయినా బ్యాక్ డ్రాప్ కొంత డిఫరెంట్ గానే సెట్ చేసుకున్నారు.

ఫైనల్ గా శుభవార్త అయితే చెప్పారు కానీ ఆ డేట్ వెనుక ఉన్న రిస్క్ గురించి పెద్దగా క్యాలికులేట్ చేసుకున్నారో లేదోనని అభిమానులు అనుమానపడుతున్నారు. ఎందుకంటే అదే రోజు మాస్ మహారాజా రవితేజ రావణాసుర ఉంది. ధమాకా, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్స్ తర్వాత తన జోరు మాములుగా లేదు. ఇప్పటికైతే వాయిదా సూచనలు లేవు. పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా జరుగుతోంది. వచ్చే వారం టీజర్ రాబోతోంది. సో పోస్ట్ పోన్ ఆశలు పెట్టుకోకపోవడం బెటర్. కిరణ్ అబ్బవరం మీటర్ కొద్దిరోజుల క్రితమే అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే కేవలం వారం గ్యాప్ లో ఏప్రిల్ 14 సమంతా శాకుంతలం, లారెన్స్ రుద్రుడు, విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 వస్తున్నాయి. వీటికి భారీ ఎత్తున రిలీజ్ దక్కనుంది. ఇన్నేసి సినిమాల మధ్య అహింసతో అభిరాం ఎలా నెగ్గుకొస్తాడనేది పెద్ద ప్రశ్న. అసలే డెబ్యూ. వీలైనంత సోలో రిలీజ్ వచ్చేలా చేసుకుంటే ప్రేక్షకులకు రిజిస్టర్ అవుతాడు. ఇలా హడావిడిగా లాంచ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనం తక్కువ. అసలు ఫిబ్రవరి, మార్చిలో అన్నేసి ఖాళీ డేట్లు వదిలేసి ఇప్పుడీ ఏప్రిల్ స్ట్రాటజీ వెనుక కారణమేంటో సినిమా చూశాక కానీ క్లారిటీ వచ్చేలా లేదు.