బలగం’ వివాదం పై వేణు సమాధానం

దిల్ రాజు ప్రొడక్షన్స్ నుండి వేణు దర్శకుడిగా పరిచయమైన బలగం ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం వేణు ఎంచుకున్న కథాంశం అందరినీ ఆకట్టుకుంది. ప్రసుతం థియేటర్స్ లో ఉన్న ఈ సినిమాకు కాపీ వివాదం అంటుకుంది.

‘బలగం’ కథ తనదేనంటూ గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ వివాదానికి తెర లేపాడు. 2014లో ఈ కథను పచ్చికి అనే పేరుతో ఓ ప్రముఖ తెలంగాణ దిన పత్రికలో ప్రచురించారని పేర్కొన్నాడు. ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకొచ్చాడు సతీశ్. దిల్ రాజు , వేణు తన కథను తీసుకొని సినిమా తీశారని కామెంట్ చేశాడు. వారి నుండి ఎలాంటి స్పందన రాకపోతే కోర్టుకి వెళ్లేందుకు సిద్దమని, కేటీఆర్ గారిని కూడా కలుస్తానని తెలిపాడు.

తాజాగా బలగం కథ కాపీ వివాదం పై దర్శకుడు వేణు సమధానమిచ్చాడు. అసలు పచ్చికి కథ తను చదవలేదని, ఆ దిన పత్రికలో స్పోర్ట్స్, సినిమా పేజీలు మాత్రమే చూస్తానని తెలిపాడు. బలగం కథ తెలంగాణ సంప్రదాయం నుండి పుట్టిందని, దర్శకుడు కేవీ అనుదీప్ తో కలిసి తను రెక్కీ చేశానని, పిట్ట ముట్టడం అనేది ఎన్నో తారల నుండి చూస్తున్నామని ఇది అందరి కథ అంటూ చెప్పుకున్నాడు వేణు. ఇందులో కొత్తదనం లేదని ఇది అందరి ఇంట్లో జరిగే కథే అంటూ చెప్పుకున్నాడు. మరి వేణు సమాధానం తర్వాత గడ్డం సతీష్ ఎలా రియాక్ట్ అవుతాడో ? ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో ? చూడాలి.