వేసవి రేసులో ‘ఖుషి’

సినిమా అనౌన్స్ అయినపుడే మంచి క్రేజ్ తెచ్చుకుంది ‘ఖుషి’. ఆ సినిమా మొదలయ్యేటప్పటికి విజయ్ దేవరకొండ డిజాస్టర్ మూవీ ‘లైగర్’ రిలీజ్ కాలేదు. సమంత కూడా అప్పటికి మంచి ఊపులోనే ఉంది. ఇలా సినిమా అనౌన్స్ చేశారో లేదో.. అలా చకచకా షూటింగ్‌కు సన్నాహాలు జరిగిపోయాయి. రెండు నెలల పాటు శరవేగంగా షూటింగ్ జరిగింది. సగం పైగా సినిమా పూర్తయింది. ఆ ఊపు అలాగే కొనసాగి ఉంటే.. గత ఏడాది క్రిస్మస్ సీజన్లోనే సినిమా రిలీజైపోయేది. కానీ ఈ చిత్రానికి అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి.

ఓవైపు విజయ్ ‘లైగర్’ ప్రమోషన్ల కోసం పక్కకు వెళ్లాడు. మరోవైపు సమంత అనూహ్యంగా అనారోగ్యం బారిన పడింది. విజయ్ ఫ్రీ అయినా సమంత కోలుకోకపోవడంతో ఆరు నెలలకు పైగా సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. దీనికి తోడు ‘లైగర్’ ఫలితం ఈ సినిమాపై ప్రతికూల ప్రభావం చూపించి.. బజ్ అంతా పోయింది.

సమంత ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో.. షూటింగ్ ఎప్పుడు అవుతుందో తెలియక రిలీజ్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. ఐతే ఎట్టకేలకు అయోమయం తొలగినట్లు కనిపిస్తోంది. సమంత ఈ నెల 8 నుంచే ‘ఖుషి’ చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇంకే అవాంతరాలు లేనట్లయితే.. విరామం లేకుండా సినిమా చిత్రీకరణ సాగించాలని.. రెండు నెలల్లో షూట్ మొత్తం పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కుదిరితే వేసవి చివర్లో అయినా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మే అంటే కష్టం కానీ.. జూన్ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి అవకాశముంది. ఈసారి షెడ్యూళ్లు అయితే పక్కా ప్లానింగ్‌తో నడవబోతున్నట్లు తెలుస్తోంది.

‘నిన్నుకోరి’, ‘మజిలీ’ తర్వాత శివ నిర్వాణ రూపొందిస్తున్న పూర్తి స్థాయి ప్రేమకథ కావడం.. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బేనర్ తీస్తున్న సినిమా కావడంతో సినిమా అంచనాలకు తగ్గట్లే ఉంటుందని భావిస్తున్నారు.