మూఢనమ్మకాలకు ఎదురెళ్ళే విరూపాక్ష యుద్ధం 

మెగా హీరోల్లో సుప్రీమ్ బ్రాండ్ తో దూసుకెళ్తున్న సాయి ధరమ్ తేజ్ కు ఆ మధ్య యాక్సిడెంట్ జరిగి నెలల తరబడి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చాక చాలా గ్యాప్ వచ్చింది. ఈ కారణంగానే తన ప్రమేయం లేకుండా ప్రమోషన్లు జరుపుకుని రిపబ్లిక్ రిలీజయ్యింది. ఎంతో కష్టపడి చేసినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. అందుకే ఆశలన్నీ విరూపాక్ష మీద పెట్టుకున్నాడు. పవన్ హరిహరవీరమల్లుకు ముందు అనుకున్న టైటిల్ ఇది. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో మొదటిసారి ఫాంటసీ జానర్ ని టచ్ చేసిన తేజు వచ్చే నెల 21న థియేటర్లలో అడుగుపెట్టబోతున్నాడు. ఇందాకే టీజర్ విడుదల చేశారు.

చుట్టూ అడవులతో ఉన్న ఓ గిరిజన గ్రామానికి వస్తాడో యువకుడు(సాయి ధరమ్ తేజ్). మూఢ నమ్మకాలతో కొట్టుమిట్టాడే ఆ ఊరిలో ఓ పెద్దాయన(సాయి చంద్) చెప్పే మాటే శాసనం. చరిత్రలో ఎప్పుడూ జరగని ఒక అనూహ్య సంఘటన అక్కడ చోటు చేసుకుంటుంది. దాని వల్ల కీడుతో పాటు ఎన్నో అనూహ్య పరిణామాలు జరుగుతాయి. దీంతో ఆ గండం నుంచి బయటపడాలంటే చాలా ప్రమాదకరమైన పరిష్కారానికి సిద్ధపడతారు. దీని వల్ల జరగబోయే నష్టాన్ని గుర్తించిన విరూపాక్ష వాళ్ళ అజ్ఞానాన్ని పారద్రోలే బాధ్యతను తీసుకుంటాడు. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి

టీజర్ లో విజువల్స్ చాలా డెప్త్ తో డిజైన్ చేశారు. సుకుమార్ స్క్రీన్ ప్లే మార్క్ అడుగడుగునా కనిపిస్తోంది. దర్శకుడు కార్తీక్ దండు సీన్స్ లో మంచి ఇంటెన్సిటి కనిపిస్తోంది. హీరోయిన్ సంయుక్త మీనన్ ని ఇందులో పెద్దగా హై లైట్ చేయలేదు. సునీల్, రాజీవ్ కనకాల లాంటి సీనియర్ క్యాస్టింగ్ చాలానే కనిపిస్తోంది. అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చిన ఈ మిస్టికల్ థ్రిల్లర్ మొత్తానికి అంచనాలు రేపేలానే ఉంది. ఏప్రిల్ 21 రిలీజ్ కాబోతున్న విరూపాక్ష హిట్ కావడం పట్ల సాయి ధరమ్ తేజ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కంటెంట్ ప్రామిసింగ్ గానే ఉంది మరి