ఇద్దరి ఆశలన్నీ మంగళవారం మీదే

ఆరెక్స్ 100తో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి ఆ తర్వాత అట్టే కలిసి రాలేదు. అందులో పాత్ర నెగటివ్ టచ్ ఉన్నది కావడంతో ఎంత పేరొచ్చినా హీరోలు తమ పక్కన జోడిగా తీసుకునేందుకు జంకారు. సరే పోన్లే ఇంకో విధంగా ట్రై చేద్దామని వయసు వ్యత్యాసం పట్టించుకోకుండా వెంకటేష్ లాంటి సీనియర్ హీరోతో వెంకీ మామలో ఆడి పాడితే దాని యావరేజ్ ఫలితం ఏ మాత్రం ఉపయోగపడలేదు సరికదా ఆ తర్వాత కెరీర్ ఇంకాస్త డల్ అయిపోయింది. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా అవేవీ జనానికి కనీసం గుర్తు లేవు.

అందుకే ఇప్పుడు మళ్ళీ తనకు మొదటి అవకాశం ప్లస్ బ్రేక్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితోనే జట్టు కడుతోంది. మంగళవారం పేరుతో రూపొందుతున్న ఈ మూవీ ప్రీ లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు. కాన్సెప్ట్ ఏదో డిఫరెంట్ గా ఉండబోతోందన్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం పాయల్ పాత్రకు చాలా షేడ్స్ ఉంటాయట. ఎవరూ ఊహించని ట్విస్టుతో ప్రతి మంగళవారం జరిగే అనూహ్య సంఘటనలకు తన క్యారెక్టర్ కు ఏదో బలమైన లింక్ తో ఆడియన్స్ కి షాక్ ఇచ్చేలా డిజైన్ చేసినట్టు వినికిడి. థ్రిల్లర్ జానర్ అనే క్లారిటీ అయితే ఉంది.

ఇది సక్సెస్ కావడం అజయ్ కు సైతం చాలా కీలకం. ఎందుకంటే రెండో చిత్రం మహా సముద్రం అంత బడ్జెట్ శర్వానంద్ సిద్దార్థ్ లాంటి క్యాస్టింగ్ ఉన్నా డిజాస్టర్ అందుకోవాల్సి వచ్చింది. టేకింగ్ ఎలా ఉన్నా అసలు కథ మీద నెగటివిటీ వచ్చింది. దెబ్బకు స్టార్ హీరోల నుంచి పిలుపులు రాలేదు. రవితేజకు స్టోరీ ఒప్పించడం దగ్గరి నుంచి ఇక్కడి దాకా వచ్చిన అజయ్ భూపతి ఈ మంగళవారంతోనే కంబ్యాక్ అవ్వాల్సి ఉంటుంది. ముప్పైకి పైగా నటీనటులు ఉన్నారట. షాలిని పాండే మరో హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటిదాకా రాని కస్టోరీ అంటున్నారు ఏంటో మరి.