ఇళయరాజా సంగీత ప్రేమికులకు అదొక్కటే లోటు

ఇసైజ్ఞాని మాస్ట్రో ఇళయరాజా లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ మొన్న హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో ఘనంగా జరిగింది. శనివారం ట్రిబ్యూట్ పేరుతో సన్మాన కార్యక్రమాలు జరగగా ఆదివారం అసలైన మ్యూజికల్ ట్రీట్ ఇచ్చారు. ఆరేళ్ళ తర్వాత భాగ్యనగరంలో రాజా నిర్వహించిన షో కావడంతో అభిమానులు బాగానే వచ్చారు. మొత్తం నిండిపోలేదు కానీ ఉన్నంతలో గత కార్యక్రమంతో పోలిస్తే ఎక్కువగానే అనిపించారు. చిరంజీవి నాగార్జున తదితర సెలబ్రిటీలను ఆహ్వానించినప్పటికీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తో సమావేశం తదితర కారణాల వల్ల వాళ్ళు హాజరు కాలేకపోయారు.

మూడు గంటలకు పైగా ఇంత వయసులోనూ నిలబడే షోని నిర్వహించిన ఇళయరాజా మొత్తం 35 పాటలను వచ్చినాళ్ళకు లైవ్ పెర్ఫార్మన్స్ ద్వారా కనువిందు చేయించారు. రుద్రవీణ, శివ, జగదేకవీరుడు అతిలోకసుందరి, బొబ్బిలిరాజా, ప్రేమ, అభినందన, సితార, అన్వేషణ, సీతాకోకచిలుక, సాగర సంగమం, గీతాంజలి, మహర్షి, శ్రీరామరాజ్యం తదితర చిత్రాల్లోని ఎవర్ గ్రీన్ సాంగ్స్ తో మైమరిపింపజేశారు. ఓ ప్రియా ప్రియా పాట తాలూకు కంపోజింగ్ దశల వారిగా ఎలా మిక్స్ చేస్తారో చూపించిన తీరు అద్భుతంగా సాగింది. అయితే అంతా బాగున్నా ఫ్యాన్స్ కి కొన్ని అంశాలు ఇబ్బంది పెట్టాయి.

మొదటిది సౌండ్ సిస్టం నిర్వహణ సరిగా లేకపోవడంతో స్టేజి మీద గాయకులు ఎంత గొప్పగా పడుతున్నా పూర్తిగా ఆస్వాదించలేని పరిస్థితి నెలకొంది. పైగా గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రమణ్యం గారు లేని లోటు స్పష్టంగా కనిపించింది వినిపించింది. ఆయన మాత్రమే చేయగలిగే వివరణలు ఇంకెవరికీ సాధ్యం కావు. అబ్బాయి చరణ్ ఎంత బాగా పాడినా తండ్రికి సరిసాటి అనిపించుకోలేడుగా. పైగా చిత్ర రాకపోవడం ఇంకొంత మైనస్ అయ్యింది. జేసుదాస్ ని రప్పించే ప్రయత్నాలు చేసినట్టు లేరు. రాజా హార్డ్ కోర్ ఫ్యాన్స్ సంగతేమో కానీ మ్యూజిక్ లవర్స్ కు మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ అనిపించేసింది.