ఆ బ‌యోపిక్ నేను చేయ‌ట్లేదు

ఇండియాలో బ‌యోపిక్ ట్రెండ్‌కు ఊపు తెచ్చింది బాలీవుడ్డే. ముఖ్యంగా స్పోర్ట్స్ స్టార్ల జీవితాల‌ను వెండితెర‌పై గొప్ప‌గా ప్రెజెంట్ చేసి కొన్ని ఘ‌న‌విజ‌యాలు అందుకుంది. మిల్కాసింగ్, ధోని లాంటి క్రీడా దిగ్గ‌జాల జీవిత క‌థ‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. కానీ ఒక ద‌శ దాటాక ప్ర‌తి స్పోర్ట్స్ స్టార్ జీవితాన్నీ తెర‌పైకి తెచ్చేయ‌డంతో ప్రేక్ష‌కులకు ఈ జాన‌ర్ ప‌ట్ల మొహం మొత్తేసింది.

సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్ లాంటి క్రీడాకారిణుల బ‌యోపిక్స్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణంగా బోల్తా కొట్టాయి. ఐతే ఇప్పుడు ఓ సెన్సేష‌న‌ల్ క్రికెట్ హీరో జీవితాన్ని తెర‌పైకి తేవ‌డానికి ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఆ హీరో ఎవ‌రో కాదు.. భార‌త క్రికెట్ రాత‌ను మార్చిన మాజీ కెప్టెన్ సౌర‌భ్ గంగూలీ.

అభిమానులు ముద్దుగా దాదాగా పిలుచుకునే సౌర‌భ్ భార‌త క్రికెట్ మీద వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. 2000 మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం త‌ర్వాత జ‌ట్టు ప‌గ్గాలు అందుకుని టీమ్ ఇండియాను గొప్ప స్థాయికి తీసుకెళ్లాడు. సౌర‌భ్ బ‌యోపిక్‌లో ర‌ణ‌బీర్ క‌పూర్ న‌టించ‌నున్న‌ట్లుగా ఇటీవ‌ల జోరుగా వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఈ ప్ర‌చారాన్ని ర‌ణ‌బీర్ ఖండించాడు.

దాదాకు ఇండియాలోనే కాక‌ ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. ఆయ‌న బ‌యోపిక్ తీస్తే అది చాలా బాగుంటుంది. దాన్ని నేను ఇష్ట‌ప‌డ‌తాను. కానీ ఆ సినిమాలో నేను న‌టిస్తున్న‌ట్లుగా జ‌రుగుతున్న ప్ర‌చారం నిజం కాదు. న‌న్ను ఇంత వ‌ర‌కు ఎవ‌రూ స్పందించ‌లేదు. దీనిపై నాకు ఎలాంటి స‌మాచారం లేదు. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నట్లున్నాయి అని ర‌ణ‌బీర్ తేల్చేశాడు. ఇంత‌కుముందు సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్‌లో న‌టించిన ర‌ణ‌బీర్.. లెజెండ‌రీ సింగ‌ర్ కిషోర్ కుమార్ బ‌యోపిక్‌లో న‌టించ‌నున్న‌ట్లు ధ్రువీక‌రించ‌డం విశేషం.