తమ్ముడి సినిమా వాయిదా మరి అన్నయ్య ?

అసలేంటబ్బా రిలీజ్ డేట్ దగ్గరపెట్టుకుని ప్రమోషన్లు చేయడం లేదనుకుంటున్న టైంలో నేను స్టూడెంట్ సర్ మార్చి 10 నుంచి వాయిదా పడింది. విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని వాళ్ళ కోసం పోస్ట్ పోన్ చేస్తున్నామని తిరిగి వేసవి సెలవుల్లో కలుసుకుందామని చల్లగా చెప్పేశారు. కొత్త తేదీ అనౌన్స్ చేయలేదు కానీ ఇంకొంత సమయం పట్టేలా ఉంది. బెల్లంకొండ గణేష్ కి ఇది రెండో మూవీ. స్వాతిముత్యంకు మంచి పేరే వచ్చినప్పటికీ అది కమర్షియల్ గా వర్కౌట్ కాకపోవడంతో ఈసారి థియేటర్ రెవిన్యూని గట్టిగా టార్గెట్ చేశాడు.

స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో నేటి విద్యావ్యవస్థలో సమస్య ఆధారంగా రూపొందిన ఈ మూవీలో నిన్నటి తరం హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు అవంతిక దాసాని హీరోయిన్ గా పరిచయమవుతోంది. టీజర్ గట్రా ఆసక్తికరంగానే ఉన్నాయి. దీని సంగతి అలా ఉంచితే గణేష్ అన్నయ్య బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ ఎప్పుడు విడుదలవుతుందో అంతు చిక్కడం లేదు. దర్శకుడు వివి వినాయక్ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేశారు కానీ దీన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తారా లేక ఓటిటికి ఇచ్చేస్తారా అనే కన్ఫ్యూజన్ ఎంతకీ తీరడం లేదు. మీడియాకి సైతం ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు.

దీని సంగతలా ఉంచితే సాయిశ్రీనివాస్ నెక్స్ట్ సాగర్ చంద్రతో కమిటైనట్టు ఆల్రెడీ టాక్ ఉంది. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ కథ నచ్చి ఇద్దరూ కలిసి చేయాలనే నిర్ణయానికి వచ్చారని వినికిడి. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తో భీమ్లా నాయక్ చేశాక సాగర్ చంద్రకు ఆశించినంత బ్రేక్ దక్కలేదు. అది రీమేక్ కావడం, ఫైనల్ రిజల్ట్ జస్ట్ హిట్టే తప్ప అంతకుమించి లేదనేలా రావడంతో బెస్ట్ ఆప్షన్ గా బెల్లంహీరో వైపు మొగ్గు చూపాడు. అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి సెన్సిబుల్ మూవీస్ తీసిన సాగర్ చంద్ర మరి మాస్ హీరోని ఎలా చూపించబోతున్నాడో.