దాదాపు స్టార్ హీరోలందరి రీరిలీజుల పర్వం అయిపోయింది. నానిని కూడా వదలకుండా మొన్న అలా మొదలైందిని విడుదల చేశారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంతు వచ్చింది. బన్నీ కెరీర్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన దేశముదురుని మార్చి 28 లేదా ఏప్రిల్ 7 థియేటర్లలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫోర్ కె టెక్నాలజీకి మార్చి భారీ ఎత్తున ప్లాన్ చేయబోతున్నారు. పుష్ప పార్ట్ 1 తర్వాత బన్నీని మళ్ళీ తెరమీద చూసే అవకాశం దక్కలేదు. సీక్వెల్ కి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఈలోగా దేశముదురు లాంటివి మంచి కిక్ ఇస్తాయి.
దర్శకుడు పూరి జగన్నాధ్ తీర్చిదిద్దిన బెస్ట్ హీరో క్యారెక్టరైజేషన్స్ లో దేశముదురు ఒకటి. యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ తో చక్రి పాటలు ఓ రేంజ్ లో హిట్టయ్యాయి. ఇప్పుడా ఆ మేజిక్ ని మళ్ళీ తెరమీద చూసుకోవచ్చు. అయితే ఏదో సంబరంలా పోకిరితో మొదలైన ఈ రీ రిలీజుల ప్రహసనం క్రమంగా జనానికి బోర్ కొట్టేస్తోందని వసూళ్లు చెబుతున్నాయి. మొన్న ఆలా మొదలైంది, మిరపకాయ్ కి కనీస స్పందన రాలేదు. చాలా చోట్ల షోలు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అంతకు ముందు నువ్వొస్తానంటే నేనొద్దంటానా పరిస్థితి కూడా ఇంతే.
ఇంకా వెనక్కు వెళ్తే ప్రేమదేశం లాంటివాటికి ప్రింట్ ఖర్చులు రాలేదు. అయినా కూడా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు వీటిని వదలడం లేదు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న గీతా ఆర్ట్స్ అఫీషియల్ గా మగధీరని రిలీజ్ చేయబోతోంది. ఈ వారం చిరంజీవి గ్యాంగ్ లీడర్ వస్తున్న సంగతి తెలిసిందే. కాస్త ఎక్కువ జనం అభిమానులు చూసేలా టికెట్ రేట్లు తగ్గించి షోలు వేయమని మూవీ లవర్స్ ఎంత డిమాండ్ చేస్తున్నా బయ్యర్ల ధోరణిలో మాత్రం మార్పు రావడం లేదు. కొత్త సినిమాల ధరలతోనే అమ్మకాలు చేయడం ఆసక్తిని క్రమంగా చంపేస్తోంది.