సీతను ఎవరూ పట్టించుకోలేదు

హిందీలో అంతంతమాత్రంగా కెరీర్ ని నెట్టుకొస్తున్న మృణాల్ ఠాకూర్ కు అందం నటన అన్నీ ఉన్నా టైం కలిసి రాక వేగంగా దూసుకెళ్లలేకపోయింది. అయితే ఏ ముహూర్తంలో దర్శకుడు హను రాఘవపూడి తనలో ప్రతిభ గుర్తించాడో కానీ సీతారామం ఇవ్వడం అది బ్లాక్ బస్టర్ కావడం చకచకా జరిగిపోయాయి. గ్లామర్ షోలతో మేజిక్ చేసే మృణాల్ ని అంత ఒద్దికైన సీత పాత్రలో అందంగా చూపించిన తీరు ఇక్కడ మంచి ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది. నాని 30లో ఆఫర్ కొట్టేయగా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో సినిమాలో తనను తీసుకునే ఆలోచన జరుగుతోందని టాక్ ఉంది.

ఇదంతా ఏమో కానీ తాజాగా రిలీజైన సెల్ఫీలో మృణాల్ ఠాకూర్ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. కుడియే నీతేరి అంటూ సాగే పాటలో అక్షయ్ కుమార్ తో ఆడిపాడింది కానీ ఏ మాత్రం లాభం లేకపోయింది. అసలు సినిమానే ఎవరూ పట్టించుకోనప్పుడు ఇక ఈ క్యామియో గురించి ఎవరు అడుగుతారు. దీంతో ఇది కాస్తా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఏదో హిట్ అయితే అవకాశాలు పెరుగుతాయని చూస్తే సెల్ఫీ బాలీవుడ్ టాప్ టెన్ డిజాస్టర్స్ వైపు పరుగులు పెడుతోంది. సినిమా మరీ దారుణంగా లేకపోయినా జనాలకు అక్షయ్ పట్ల ఉన్న నెగటివిటీ వసూళ్లను దెబ్బ కొట్టింది

ఇకపై మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే మంచిది. లక్కీగా మెగా పవర్ స్టార్ ప్రాజెక్టు కనక వస్తే స్టార్ లీగ్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం తనవి హిందీలో గుంరాహ్, పూజా మేరీ జాన్, పిప్పా విడుదలకు సిద్ధంగా ఉండగా ఆంఖ్ మిచోలి నిర్మాణంలో ఉంది. నానితో జట్టు కట్టింది. సో మరీ ఓవర్ బిజీగా అయితే లేదు కాబట్టి తెలుగు నుంచి వచ్చే ఆఫర్లను జాగ్రత్తగా వడబోసుకుని ఎంచుకుంటే పూజా హెగ్డే తరహాలో ఇక్కడే సెటిలైపోవచ్చు. ఆమె కూడా ఉత్తరాదిలో ఫెయిలయ్యాక దక్షిణాదికి వచ్చి టాప్ చైర్ అందుకోవడం తెలిసిందే