రిలీజ్ కు ముందే ఒక స్టార్ హీరో సినిమా నెగటివ్ పబ్లిసిటీతో విడుదల కావడం అరుదుగా జరుగుతుంది. అక్షయ్ కుమార్ తాజా చిత్రం సెల్ఫీ దీనికో కొత్త ఉదాహరణగా నిలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో దారుణమైన నెంబర్లు నమోదు చేసిన ఈ మలయాళం రీమేక్ అసలే అంతంత మాత్రంగా ఉన్న అంచనాలను పెద్దగా అందుకోలేక మరో ఫ్లాప్ దిశగా పరుగులు పెడుతోంది. పఠాన్ వెయ్యి కోట్ల గ్రాస్ తెచ్చిందని బాలీవుడ్ ట్రేడ్ చంకలు గుద్దుకుంటున్న తరుణంలో ఇప్పుడీ పరిణామం ఏ మాత్రం మింగుడు పడటం లేదు. హిట్టో ఫ్లాపో తేలక ముందే తిరస్కారం గురవ్వడం ఊహించనిది.
ఫస్ట్ డే ఇండియా మొత్తం మల్టీప్లెక్సుల్లో సెల్ఫీకి కేవలం కోటి ముప్పై లక్షలు వసూలయ్యంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వీకెండ్ లో పోటీ లేకపోయినప్పటికీ దాన్ని వాడుకునే అవకాశం కనిపించడం లేదు. అక్షయ్ కుమార్ చేసిన గత పది సినిమాల్లో ఇది తొమ్మిదో సూపర్ ఫ్లాప్. సూర్యవంశీ మాత్రమే కమర్షియల్ గా మంచి వసూళ్లు దక్కించుకోగా అది కూడా మల్టీస్టారర్ ఫ్లేవర్ వల్లే సాధ్యమయ్యిందని నెటిజెన్ల అభిప్రాయం. ఆఖరికి డైరెక్ట్ ఓటిటిలో వచ్చిన లక్ష్మి, కట్ పుత్లీ, అత్ రంగీరే లాంటివి సైతం కనీస స్థాయిలో మెప్పించలేకపోవడం అక్షయ్ సెలక్షన్ ని ఎత్తి చూపుతోంది.
బెల్ బాటమ్, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్విరాజ్, రక్షా బంధన్, రామ్ సేతు ఇలా వరసగా అన్నీ కనీసం బ్రేక్ ఈవెన్ దాటని కళాఖండాలు. ఒకప్పుడు ఎయిర్ లిఫ్ట్, టాయిలెట్, రుస్తుం లాంటి కాన్సెప్ట్ ఆధారిత సినిమాలతో వందల కోట్లు కొల్లగొట్టిన అక్షయ్ కు ఒక రకంగా చెప్పాలంటే ఇది పరాభవమే. రెమ్యునరేషన్లు పుచ్చుకుంటూ వేగంగా సినిమాలు చేయడం కాదు కొన్నవాళ్లకు ఓ రెండు రూపాయలు వచ్చినప్పుడే ఏ హీరోకైనా సక్సెస్ ట్రాక్ అనేది నిలబడుతుంది. ఇవన్నీ చూసే మీరు నటన మానేసినా పర్వాలేదు కానీ ఇలాంటివి చేయకండని ఫ్యాన్స్ వేడుకోవడంలో న్యాయముంది.