కెరీర్ పరంగా ఎలాంటి గ్యాప్ రాకుండా హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్న అతికొద్ది హీరోల్లో నాని ముందు వరసలో ఉంటాడు. ఒక పరాజయం రాగానే ఏళ్ళ తరబడి టైం వేస్ట్ చేసే బాపతు కాకుండా క్రమం తప్పకుండా స్పీడు క్వాలిటీ రెండింటికి ప్రాధాన్యం ఇస్తున్న నాని నెక్స్ట్ చేయబోయే లైనప్ ని ఏడు సినిమాలకు పైగానే సిద్ధం చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం తన 30వ చిత్రాన్ని శౌర్యువ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. దసరా ప్రమోషన్లు పూర్తి కాగానే నాని దీని రెగ్యులర్ షూటింగ్ ని స్పీడప్ చేస్తాడు.
తరువాతి వరసలో హను రాఘవపూడి ఒక కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్టు సమాచారం. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాథ మంచి విజయం సాధించింది. సీతారామం తర్వాత హను జాగ్రత్తగా ఎంచుకున్న ప్రాజెక్ట్ ఇది. హిట్ 3 ది థర్డ్ కేసు స్క్రిప్ట్ పనులు ఎప్పుడు పూర్తయితే అప్పుడు శైలేష్ కొలనుకి నాని డేట్లు ఇస్తాడు. కానీ వెంకటేష్ తో చేస్తున్న సైంధవ్ అయ్యే దాకా అతను ఫ్రీ కాలేడు. డివివి దానయ్య నిర్మాతగా అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయతో మరో కలయికకు ఛాన్స్ ఉందట. దీన్నే చూచాయగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
దిల్ రాజు వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ కో కమిట్ మెంట్ బాకీ ఉన్నారు. నాని డేట్లకు హామీ ఉంది కాబట్టి కథ లాక్ అయిపోతే ఈ కాంబినేషన్ పట్టాలు ఎక్కుతుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో మారుతీ డైరెక్షన్లో భలే భలే మగాడివోయ్ సీక్వెల్ ప్రతిపాదన కార్యరూపం దాల్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఇవి కాకుండా సితార ఎంటర్ టైన్మెంట్స్ కు నాని ఓ సినిమా చేయాల్సి ఉంది. వీటి కౌంట్ టోటల్ గా ఏడు. అంటే ఇంకో రెండేళ్లకు పైగా తన డైరీ ఖాళీగా లేనంత బిజీగా నాని ఉంచుకోబోతున్నాడు. మొదటిది తప్ప మిగిలినవేవీ అధికారికంగా ప్రకటించినవి కాదు కానీ దాదాపు ఫిక్స్ అయినట్టే.