సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక గ్రాసర్ గా నిలిచిన వీరసింహారెడ్డి అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ ఓటిటిలో వచ్చేసింది. సాధారణంగా ఉండే అర్ధరాత్రి ప్రీమియర్ల స్ట్రీమింగ్ కు భిన్నంగా నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచే అందుబాటులోకి తేవాలనే డిస్నీ హాట్ స్టార్ ప్లానింగ్ బాగా వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. గంటలోపే నూటా యాభై మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయని డిజిటల్ వర్గాల టాక్. మొన్న వారసుడు ప్రైమ్ లో వచ్చినప్పటికీ దానికీ స్థాయిలో సగం స్పందన కూడా లేదు. కానీ బాలయ్య బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
ఇక్కడ ప్రమోషన్లను ప్లాన్ చేసుకోవడంలో డిస్నీ అమలుపరిచిన స్ట్రాటజీ చాలా ప్లస్ అయ్యింది. క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో ట్వీట్లు పోస్టులతో యాడ్స్ ఇవ్వడమే కాక పలు రకాల కాంటెస్టులతో మూవీ లవర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అంతే కాదు తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రధాన నగరాల్లో జై బాలయ్య స్పెషల్ సాంగ్ ని ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా లాంచ్ ప్లాన్ చేయడం ఇదే మొదటిసారి. అంతే కాదు బాలయ్యతో ప్రత్యేకంగా వీడియో బైట్లు చెప్పించి ప్రచారానికి వాడుకుంటున్నారు. మొత్తానికి థియేటర్ రిలీజ్ రేంజ్ లో హడావిడి నెలకొంది.
ఎంత థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న సినిమాలైనా సరే కోట్లు ఖర్చు పెట్టి హక్కులు కొన్నప్పుడు దాన్ని వీలైనంత జనానికి చేరువ చేయడం చాలా అవసరం. వీరసింహారెడ్డి విషయంలో జరుగుతోంది అదే. సాధారణంగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలను అధిక శాతం ప్రైమ్ లేదా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంటూ వచ్చాయి. కానీ దానికి భిన్నంగా అఖండ రెస్పాన్స్ చూశాక క్రేజీ ఆఫర్ ఇచ్చి మరీ వీరసింహారెడ్డిని హాట్ స్టార్ సొంతం చేసుకుంది. జనవరి భారీ చిత్రాల్లో అన్నీ ఓటిటిలో వచ్చేయగా బ్యాలన్స్ ఉన్న వాల్తేరు వీరయ్య 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో రానుంది.