ఖాకీ డ్రెస్సులో అల్లరోడి ఉగ్రరూపం

ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ తర్వాత అవే రొటీన్ గా మారిపోవడంతో చాలా ఫ్లాపులు చవి చూడాల్సి వచ్చింది. సుడిగాడు టైంలో హౌస్ ఫుల్స్ బోర్డులు వేయించిన స్థాయి నుంచి ఓపెనింగ్స్ రావడమే కష్టమనే రేంజ్ కి దిగాడు. కానీ మహర్షితో మొత్తం లెక్కలు మారిపోయాయి. సీరియస్ రోల్స్ లోనూ తనను జనం రిసీవ్ చేసుకుంటారని అర్థం చేసుకున్న నరేష్ కు గత ఏడాది నాంది మరో పెద్ద బ్రేక్ ఇచ్చింది. హాస్యమే లేకుండా రూపొందిన ఆ సీరియస్ డ్రామా ప్రేక్షకులను మెప్పించింది.

మళ్ళీ అదే కాంబోతో ఉగ్రంతో పలకరించబోతున్నాడు. నాంది దర్శకుడు విజయ్ కనకమేడల రెండో చిత్రంగా ఇది రాబోతోంది. ఇందులో అల్లరోడు సీరియస్ పోలీస్ ఆఫీసర్ శివ కుమార్ గా నటించాడు. అవతలోడు ఎలాంటి వాడైనా సరే డ్యూటీకి ఎదురొస్తే ఉతికి ఆరేసే మనస్తత్వం. భార్య కూతురు చక్కని కుటుంబం. ఇలా హాయిగా సాగిపోతున్న ఇతని జీవితంలో అలజడి రేగుతుంది. ఫ్యామిలీ జోలికి వస్తే ఎంతటి అరాచకానికైనా సిద్ధపడే శివ విపత్కర పరిస్థితులను ఎలా ఎదురుకున్నాడనేది ఉగ్రం. నాగ చైతన్య చేతుల మీద టీజర్ లాంచ్ ని హైదరాబాద్ ఏఎంబిలో చేశారు.

స్టోరీ లైన్ పరంగా మరీ కొత్తదనం లేకపోయినా సన్నివేశాల్లో ఇంటెన్సిటీతో అల్లరి నరేష్ ని చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు విజయ్ కనకమేడల. చిన్న వీడియో కాబట్టి కథ ఇదేనని నిర్ధారణకు రాలేం కానీ చూచాయగా పాయింట్ చెప్పారు కనక దాన్ని బట్టి చూస్తే కథకన్నా ఎక్కువగా కథనం మీద నడిచే సినిమాగా అనిపిస్తోంది. మిర్నా హీరోయిన్ గా నటించిన ఈ కాప్ థ్రిల్లర్ కు శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా సిద్దార్థ్ ఛాయాగ్రహణం అందించారు. మాటలు అబ్బూరి రవి. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం తర్వాత నరేష్ దీని మీద భారీ నమ్మకంతో ఉన్నాడు.