హార్మోన్ ఇంజక్షన్లు తీసుకోవడంపై హన్సిక

2003లో వచ్చిన హృతిక్ రోషన్ సినిమా ‘కోయీ మిల్ గయా’లో బాల నటిగా కనిపించింది హన్సిక మొత్వాని. ఆ తర్వాత హిందీలోనే మరి కొన్ని చిత్రాల్లో చిన్న పిల్లగానే కనిపించింది. కానీ కొన్నేళ్లు తిరిగేసరికే.. 2007లో అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించిన ‘దేశముదురు’ చిత్రంతో ఆమె హీరోయిన్ అయిపోయింది.

బాల నటిగా కెరీర్ మొదలుపెట్టిన నాలుగేళ్లకే ఫుల్ లెంగ్త్ హీరోయిన్ అయిపోవడం చాలామందికి పెద్ద షాక్. ఐతే ఇంత వేగంగా బాల నటి నుంచి హీరోయిన్ అవ్వడానికి వైద్యురాలైన తన తల్లి సాయం తీసుకుందని అప్పట్లో ఆమెపై ఆరోపణలు వచ్చాయి. హార్మోన్ ఇంజక్షన్లు తీసుకోవడం వల్లే ఆమె యువతిగా ట్రాన్స్‌ఫామ్ అయిందంటూ అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. హార్మోన్ల ప్రభావంతో హన్సిక శరీరంలో అనూహ్య మార్పులు వచ్చాయంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు కూడా ప్రచురితం అయ్యాయి.

ఐతే అప్పట్లో హన్సిక కానీ, ఆమె తల్లి కానీ ఈ వార్తల గురించి ఏమీ స్పందించలేదు. ఐతే ఇటీవలే సోహైల్ కథూరియా అనే తన స్నేహితుడినే పెళ్లి చేసుకుంది హన్సిక. ఆ వివాహ వేడుకకు సంబంధించి హాట్ స్టార్‌లో ప్రసారం అవుతున్న ‘లవ్ షాదీ డ్రామా’లో అప్పటి వార్తల గురించి హన్సిక, ఆమె తల్లి స్పందించారు. దీనిపై హన్సిక మాట్లాడుతూ.. ‘‘అప్పట్లో నా గురించి వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలే.

ఒక సెలబ్రెటీ అయినందుకు నేను విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నా. నాకు 21 ఏళ్ల వయసుండగా అలాంటి చెత్త వార్తలు రాశారు. అప్పట్లో అవి తీసుకుంటూ ఉంటే ఇప్పటికీ తీసుకుంటూ ఉండాలి. నేను ఎదగడానికి ఇంజక్షన్లు తీసుకున్నట్లు రాసి పారేశారు. పైగా నేను పెద్దదానిలా కనబడడం కోసం నా తల్లే స్వయంగా హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చారని రాశారు’’ అని హన్సిక ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ విషయంపై హన్సిక తల్లి మాట్లాడుతూ.. తన కూతురికి అప్పట్లో హార్మన్ ఇంజక్షన్లు ఇవ్వాలంటే తాము టాటా, బిర్లాల కన్నా ధనవంతులమై ఉండాలని.. కనీసం మిలియనీర్ అయి ఉండాలని వ్యాఖ్యానించారు. తాము పంజాబీలమని.. తమ దగ్గర 12-16 ఏళ్ల వయసులోనే ఆడపిల్లలు త్వరగా ఎదుగుతారని ఆమె అన్నారు.