200 కోట్ల నుంచి 20 కోట్లకు పడ్డాడు

కార్తీక్ ఆర్యన్.. బాలీవుడ్లో ఉన్నట్లుండి రైజ్ అయిన యువ నటుడు. కెరీర్లో ఒక దశ వరకు చిన్న స్థాయి సినిమాలే చేశాడు కానీ.. గత ఏడాది అతడి పేరు మార్మోగిపోయింది. హార్రర్ కామెడీ ఫిల్మ్ ‘భూల్ భూలయియా-2’తో అతను పెద్ద హిట్టే కొట్టాడు.

కార్తీక్ రేంజికి ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడితే ఎక్కువ అనుకున్నారు. కానీ కొవిడ్ స్లంప్ నుంచి తేరుకోలేక సతమతం అవుతున్న బాలీవుడ్‌కు ఈ సినిమా ఊపిరిలూదింది. ఫుల్ రన్లో ఏకంగా రూ.200 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.

బాలీవుడ్ టాప్ స్టార్ల సినిమాలు చతికిలపడుతున్న టైంలో ఈ చిత్రం ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టడంతో కార్తీక్‌ను నెక్స్ సూపర్ స్టార్ అంటూ కీర్తించేశారు బాలీవుడ్ క్రిటిక్స్, ట్రేడ్ అనలిస్టులు. కానీ ఏడాది తిరిగేసరికి బాక్సాఫీస్ అతడి గాలి తీసేసింది. పెద్ద కాస్ట్ అండ్ క్రూతో తెరకెక్కిన కార్తీక్ తర్వాతి చిత్రం ‘షెజాదా’ బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవం ఎదుర్కొంది.

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘షెజాదా’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘షెజాదా’ పట్ల ఎందుకో ముందు నుంచి హిందీ ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించలేదు. రిలీజ్ ముంగిట దీనికి అస్సలు బజ్ కనిపించలేదు. బాలీవుడ్లో సౌత్ రీమేక్‌లు బోల్తా కొడుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ.. మధ్యలో ‘దృశ్యం-2’ బాగా ఆడిన నేపథ్యంలో ఇది కూడా అలాగే మ్యాజిక్ చేస్తుందని అనుకున్నారు. కానీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు.

‘భూల్ భూలయియా-2’కు తొలి రోజు రూ.15 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వస్తే దీని డే-1 కలెక్షన్లు 6 కోట్లకు మించలేదు. వీకెండ్ అయ్యేసరికి సినిమా రూ.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ల దగ్గర నిలిచింది. సోమవారం నుంచి సినిమాను అస్సలు పట్టంచుకోవట్లేదు ప్రేక్షకులు.

ఇక రాబోయే వసూళ్లు నామమాత్రం అని అర్థమవుతోంది. వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ పెట్టినా సరే.. వసూళ్లు ఇంత తక్కువగా రావడం చూసి ట్రేడ్ పండిట్లు ఆశ్చర్యపోతున్నారు. 200 కోట్ల హీరో తర్వాతి సినిమాకు 20 కోట్లకు పడిపోయాడేంటని కామెంట్లు చేస్తున్నారు.