3 నెలల ముందే హౌస్ ఫుల్స్ ఏంటయ్యా

మాములుగా ఎంత క్రేజ్ ఉన్న సినిమా అయినా సరే అడ్వాన్స్ బుకింగ్ మహా అయితే రిలీజ్ డేట్ కి ఓ రెండు వారాలు లేదా నెల ముందు పెడతారు. మరి ఏకంగా మూడు నెలల ముందే ఆన్ లైన్ ఓపెన్ చేసి ఆ టికెట్లు హాట్ కేక్ లా అమ్ముడుపోయి హౌస్ ఫుల్స్ పడితే దాన్నేమంటారు. మే 19న విడుదల కాబోతున్న ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10 దీన్ని నిజం చేసి చూపిస్తోంది. ఎక్కడో ఢిల్లీ ముంబైలో కాదు హైదరాబాద్ లో పివిఆర్ మల్టీప్లెక్సుల్లో పెట్టిన అయిదు పది షోలు గంటల్లో సోల్డ్ అవుట్ కు పరుగులు పెడుతున్నాయి. ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు

ఫాస్ట్ ఎక్స్ గా పిలుచుకుంటున్న ఈ రోడ్ ఛేజింగ్ థ్రిల్లర్ లో విన్ డీజిల్, మిచెల్లె రోడ్రిగ్యుజ్, టైర్స్ గిబ్సన్, జేసన్ మామో లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉంది. 340 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో ఇది రూపొందింది. ఇప్పటిదాకా ఈ సిరీస్ లో 9 సినిమాలు వచ్చాయి. అన్నీ బ్లాక్ బస్టర్లే. ఈ పదో భాగంతో ముగింపు పలకాలని చూస్తున్నారు కానీ డిమాండ్ చూస్తుంటే ఇప్పట్లో ఈ ప్రవాహం ఆగేలా లేదు. లూయిస్ లెటేరియర్ దర్శకత్వం వహించిన ఫాస్ట్ ఎక్స్ ట్రైలర్ ఇటీవలే యూట్యూబ్ లో వచ్చింది. దాంట్లో విజువల్స్ చూశాకే జనం టికెట్లు కొనకుండా ఉండలేకపోతున్నారు.

అయినా ఆర్ఆర్ఆర్, బాహుబలి, కెజిఎఫ్ లాంటి వాటికి సైతం ఇంత ముందస్తుగా బుకింగ్స్ పెట్టలేదు కానీ హాలీవుడ్ మూవీస్ కి మాత్రం డిస్ట్రిబ్యూటర్లు మంచి ప్లానింగ్ తో ఉంటున్నారు. ముఖ్యంగా 4డిఎక్స్ సౌకర్యం ఉన్న స్క్రీన్లలో ఇలాంటి సినిమాలు చూస్తే వచ్చే మజానే వేరు. స్క్రీన్ మీద ఏం జరుగుతుందో వాటిని ప్రత్యక్షంగా ఆస్వాదించేలా సీట్లకు సైడ్ వాల్స్ కు చేసిన ఏర్పాట్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు పెట్టిన టికెట్లు కూడా అధిక శాతం వీటిలోవే. అందుకే ఇంత వేగంగా టైటిల్ తో పోటీ పడుతూ సేల్ అవుతున్నాయి. మహేష్ బాబు రాజమౌళి సినిమాకు కూడా ఇంత క్రేజ్ రావొచ్చేమో.